మొలలు… చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్న వ్యాధి. అదే మూలశంక. శరీరంలో ఒక మూలన ఉన్న అవయవంలో వృద్ధి చెందుతుండడంతో దీన్ని మూలశంకగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్న వారు మామూలు రోజుల కంటే ఎండాకాలంలో ఎక్కువగా బాధ పడతారు. ప్రపంచం జనాభాలో సగం మందికి యాభై ఏళ్ల వయస్సులో ఈ వ్యాధి వస్తోంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మూల వ్యాధి బయట పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా ఇది వస్తోంది. డయాబెటిస్‌ మాదిరిగానే పది, పదిహేను ఏళ్ల వయస్సు గల పిల్లల్లోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. మొలలు ఒక స్థాయిని దాటిపోతే రోగులు ఒక చోట కూర్చోలేరు. నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. మలవిసర్జన సమయంలో నరకం అనుభవిస్తారు.

వ్యాధికి కారణాలు
మలబద్ధకం వల్ల ఈ వ్యాధి వస్తోంది. కొందరు వేడి పెరిగిపోవడం వల్ల వస్తోందని, మరికొందరు ఎక్కువ సమయం ఒకేచోటా కూర్చోవడం వల్ల వస్తోందని అనుకుంటారు. ఇది వాస్తవం కాదు.

  • కొంతమందికి మలవిసర్జన బలవంతంగా అవుతుంది. అంటే వారు ముక్కుతుంటారు. మూల వ్యాధి రావడానికి ఇదొక కారణం.
  • మనం తీసుకునే ఆహారంలో పీచు తగిన మోతాదులో లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తోంది.
  • ఇది అందరిలోనూ ఉంటుంది. యాభై ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత బయటపడుతుంది.
  • ముఖ్యంగా ఈ వ్యాధి థైరాయిడ్‌, డయాబెటిస్‌ ఉన్న వారికి ఎక్కువగా సోకుతుంది.

అలాగే శరీరంలోని చెడు రక్తం మలద్వారం దగ్గర రక్తనాళా ల్లో గడ్డకట్టడం వల్ల మొలలు పెరుగుతాయి.
గుర్తించడం ఎలా?

  • చాలా వ్యాధులను మనమే గుర్తిస్తాం. నొప్పి బాగా రావ డం వల్ల గానీ, ఆ అవయవం వద్ద వాపు ఉండడం వల్ల గానీ వ్యాధిని గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి మాత్రం అలా కాదు. దీనికి నొప్పి, వాపు వంటివి
  • ఉండకపోవడంతో గుర్తించలేం.
  • కొందరికి మలవిసర్జన సమయంలో రక్తస్రావం జరుగుతుం ది.మొలల వల్ల ఇలా జరుగుతుందని ఎవరూ గమనించలేరు.
  • వైద్య పరీక్షల ద్వారా వ్యాధి ఉందా? లేదా? అన్నది నిర్ధారణ చేసుకోవాలి.
  • మలవిసర్జన సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు ఈ వ్యాధి నిపుణులను సంప్రదించాలి.
  • ప్రొక్టోస్కోపి పరికరంతో పరీక్షలు నిర్వ హించిన తర్వాత మొలల వ్యాధి నిర్ధారణవుతుంది. అప్పుడే వాటి స్థాయి గురించి తెలుస్తుంది.

వ్యాధి స్థాయిలు…
ఈ వ్యాధి మూడు రకాలుగా నాలుగు స్థాయిల్లో ఉంటుంది. మొదటి, రెండు స్థాయిల్లో దీన్ని మనమే నివారించుకోవచ్చు. మూడో స్థాయిలో ఉందంటే వైద్యనిపుణులను సంప్రదిం చాల్సిందే.

  • ప్రథమ స్థాయి: మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలు సాగిపోవడం లేక ఉబ్బిపోయి వాటి స్థితిని కోల్పోతాయి.
  • ద్వితీయ స్థాయి: సాగిపోయిన రక్తనాళాలు మలద్వారం వద్ద వేలాడతాయి. మలవిసర్జన తర్వాత శుభ్రం చేసుకునేటప్పుడు అవి చేతికి తగులుతాయి.
  • తృతీయ స్థాయి: రక్తనాళాలు బాగా సాగిపోయి మలద్వారం వద్ద వేలాడతాయి. శుభ్రం చేసుకునేటప్పుడు వాటిని చేత్తో తోస్తే లోపలకు వెళ్లిపోతాయి.
  • నాలుగో స్థాయి: మూల వ్యాధికి ఇది చివరి స్థాయి. మల
  • ద్వారం దగ్గర రక్తనాళాలు బాగా సాగి వేలాడతాయి. లోపలకు వెళ్లవు. ఒకవేళ చేత్తో తోసినా మళ్లీ బయటకు వచ్చేస్తాయి. మలవిసర్జన జరిగినా, జరగకపోయినా ఇవి బయటకు వేలాడతాయి. ఈ స్థాయిలన్నీ దాటిపోయిన తర్వాత వ్యాధి బాగా ముదిరిపోతుంది.

ఇవీ రకాలు

  • ఇంటర్నల్‌: మలద్వారం లోపల ఉండే మొలలను ఇంటర్నల్‌ అంటారు.
  • ఎక్స్‌టర్నల్‌: మలద్వారం చుట్టూ బయటకు ఉండే వాటిని ఎక్స్‌టర్నల్‌ అని వ్యవహరిస్తారు.
  • ఇంట్రో ఎక్స్‌టర్నల్స్‌: మలద్వారం లోపలికి, బయటకు వ్యాపించి ఉన్న మొలలను ఇంట్రోఎక్స్‌టర్నల్స్‌ అంటారు.

చికిత్సా విధానం
ఈ వ్యాధి నివారణకు అల్లోపతి, ఆయుర్వేదంలో అనేక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అల్లోపతిలో వైద్యులు ఎక్కువగా శస్త్రచికిత్స ద్వారా మొలలను తొలగిస్తున్నారు. ఈ వ్యాధి మొదటి, రెండో స్థాయిలో ఉన్నప్పుడు మందులతో తగ్గించుకోవచ్చు. ఇది మూడో స్థాయిలో ఉంటే శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆపరేషన్‌ అంటే భయపడే రోగులకు ఆయుర్వేద వైద్యం ఒక పరిష్కార మార్గం. ప్రొక్టోస్కోపితో మొలల స్థాయిని తెలుసుకుంటారు. వేలాడుతున్న వాటిని ఒక ముడి వేస్తారు. వారం రోజులకు ఇవి మలవిసర్జనతోపాటు ఊడిపోతాయి. దీన్నే క్షారసూత్ర విధానమంటారు. ఆయుర్వేదంలో వ్యాధి స్థాయిని బట్టి చికిత్స ఉంటుంది.

జాగ్రత్తలు ఇలా…

  • పొట్లకాయ, బీరకాయ, బెండకాయ, దొండ, చిక్కుడు కూరగాయలతోపాటు గోంగూర, పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకు కూరలను ఎక్కువగా తినాలి.
  • మనిషి రోజుకు కనీసం రెండు, మూడు లీటర్ల నీటిని తాగాలి. ఎండాకాలంలో మరిన్ని ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు.
  • మాంసాహారాన్ని ఒక పద్ధతిలో తీసుకోవాలి.
  • భోజనం చేసేటప్పుడు పచ్చళ్లను పరిమితికి మించకూడదు.
  • మజ్జిగతోపాటు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • ప్రతిరోజూ వ్యాయామం గానీ, వాకింగ్‌ గానీ చేయాలి.
  • దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడమే కాకుండా మలవిసర్జన సులువుగా అవుతుంది.
  • జామ, బత్తాయి, అరటి పండు, బొప్పాయిని ఎక్కువగా తినాలి.
  • పరకడుపుతో లీటరు నీటిని తాగడం మంచిది.

మహిళల్లో…
మూల వ్యాధి ఎక్కువగా గర్భిణుల్లో బయటపడుతుంది. కడుపులోని శిశువు బరువు పెద్దపేగుపై పడుతుంది. దీంతో వారిలో మలవిసర్జన సులువుగా జరగదు. కొంత బలవంతంగా చేయాల్సి వస్తుంది. దీనివల్ల మలద్వారం దగ్గర మొలలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి మహిళల్లో మలద్వారానికి పైభాగంలో, పురుషులకు కింది భాగంలో ఏర్పడతాయి

Share.
Leave A Reply

Exit mobile version