తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలతో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తానన్నారు. శాంతిభద్రతల కోసం అహర్నిశలూ శ్రమిస్తానని చెప్పారు. కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పని చేస్తామన్నారు.
‘‘నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పని తీరు కనబరిచారు. మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారింది. నేరగాళ్లు సైతం కొత్త కొత్త టెక్నాలజీని అనుసరిస్తూ నేరాలు చేస్తున్నారు. ఇది పోలీసులకు సవాలుగా మారింది. ఎన్ని కేసులు పెట్టినా.. డ్రగ్స్ ముఠాలు కూడా విస్తరిస్తున్నాయి. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీసుబృందం బాగా కృషి చేస్తోంది. శాంతిభద్రతల సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకుందని సీవీ ఆనంద్ అన్నారు. ‘‘ఈ కేసును ప్రస్తుతం సిట్ విచారిస్తోంది. గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడే.. ఈ కేసు గురించి నాకు తెలుసు. త్వరలో ఈ కేసును సమీక్షించి తుది ఛార్జిషీట్ ఫైల్ చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విధులు నిర్వర్తించారు. 2017లో అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. 2021 డిసెంబర్ 24న హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఆయన.. 2023 ఆగస్టు 7న డీజీగా పదోన్నతి పొందారు. 2024 సెప్టెంబర్ 7న రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2025 సెప్టెంబర్ 27 నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయన 2028జూన్ వరకు డీజీపీగా కొనసాగనున్నారు.

