• రూ. 1,745 కోట్ల విలువైన అత్యున్నత నాణ్యత కలిగిన 349 కిలోల కొకైన్ స్వాధీనం
  • ఈ అద్భుతమైన విజయంపై ఎన్‌సీ‌బీ బృందాన్ని అభినందించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
  • మాదకద్రవ్యాల ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం: కేంద్ర హోం మంత్రి
  • చిన్న పరిమాణంలోని మాదకద్రవ్యం ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టి దాని వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోన్న ఈ ఆపరేషన్: కేంద్ర హోం మంత్రి
  • గత ఆరు నెలలకు పైగా నిరంతరం నిఘా ఉంచి పక్కా సమాచారంతో ఎన్‌సీ‌బీ చేపట్టిన ఈ ఆపరేషన్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది: కేంద్ర హోం మంత్రి
  • ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో విజయవంతం అయిన ఆపరేషన్.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి ఉన్న ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని తెలియజేస్తోంది: కేంద్ర హోం మంత్రి

 

సంఘటిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో భారీ విజయం నమోదైంది. ‘ఆపరేషన్ వైట్ స్ట్రైక్’ ద్వారా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. అంతర్జాతీయ కొకైన్ స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. ముంబయి, దాని పరిసర లాజిస్టిక్స్ కారిడార్ల నుంచి అక్రమ మార్కెట్లో సుమారు రూ. 1,745 కోట్ల విలువైన అత్యున్నత నాణ్యత కలిగిన దాదాపు 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది.

గత ఆరు నెలలకు పైగా నిరంతరం నిఘా ఉంచి పక్కా సమాచారంతో చేపట్టిన ఈ ఆపరేషన్ ఘన విజయాన్ని నమోదు చేసింది.

ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం ఆధారంగా కలంబోలి – భివాండి కారిడార్‌లో (నవీ ముంబయి – థానే ప్రాంతం) బహుళ బృందాలు సమన్వయంతో దాడులు నిర్వహించాయి. గోదాములు, రహస్య రవాణా వ్యవస్థలను ఉపయోగిస్తూ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ సరఫరా నెట్‌వర్క్‌ను ఈ దాడులు బట్టబయలు చేశాయి.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి స్పందించారు. “మాదకద్రవ్యాల ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం. ముంబయిలో రూ. 1745 కోట్ల విలువైన అత్యున్నత నాణ్యత కలిగిన 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఒక ప్రధాన అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాను ఎన్‌సీబీ అణిచివేసింది. చిన్న పరిమాణంలోని మాదకద్రవ్యం ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టి దాని వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఈ ఆపరేషన్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన ఎన్‌సీబీ బృందానికి అభినందనలు” అని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో విజయవంతం అయిన ఆ ఆపరేషన్.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి ఉన్న ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని తెలియజేస్తోంది.

రెండు దశల ఆపరేషన్‌లో భారీగా పట్టుబడిన డ్రగ్స్

మొదటి దశ దాడిలో భాగంగా నవీ ముంబయిలోని కలంబోలికి చెందిన సెక్టార్ కేడబ్ల్యూసీలోని కేడబ్ల్యూసీ వేర్‌హౌసింగ్ కాంప్లెక్స్ సమీపంలో ఎంహెచ్-03-డీపీ-3803 రిజిస్ట్రేషన్ నంబర్ గల ‘మారుతి సుజుకి సూపర్ క్యారీ (సీఎన్‌జీ)’ వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేశారు. ఇందులో సుమారు ఒక్కోటి ఒక కిలో బరువు ఉన్న 136 కొకైన్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. క్రికెట్ ప్యాడ్‌లు, గ్లౌజుల మధ్య ఈ కొకైన్‌ను అత్యంత రహస్యంగా దాచి ఉంచారు. ఈ క్రమంలో ఒక నిందితుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని విచారించగా.. ప్రధాన వేర్‌హౌసింగ్ కేంద్రమైన భివాండిలో మాదకద్రవ్యాలు దాచి ఉంచినట్లు వెల్లడైంది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌సీబీ బృందం.. భివాండి‌లోని (థానే జిల్లా) రెహనాల్ గ్రామంలో ఉన్న రెహనాల్ బస్టాండ్ సమీపంలోని లక్ష్మణ్ కాంపౌండ్‌లో ఉన్న ఒక గోదాంపై రెండో దశ దాడి నిర్వహించింది. ఈ తనిఖీల్లో మరో 213 కిలోల (ఒక్కోటి 1 కిలో చొప్పున 213 ప్యాకెట్లు) కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బట్టబయలైన అధునాతన రహస్య పద్ధతి

భారత్‌కు దిగుమతి చేసుకున్న ఒక యంత్రం‌లోని ఖాళీ ప్రదేశంలో ఈ మాదకద్రవ్యాలను దాచి పెట్టి తెప్పించినట్లు ప్రాథమిక విచారణలో భాగంగా వెల్లడైంది. ప్రతి ప్యాకెట్‌ను ఒక నల్లటి జిగట పదార్థంతో కూడిన పొరతో కలిపి మొత్తం 9 పొరల విభిన్న రకాల పాలిథిన్ కవర్లతో ప్యాక్ చేశారు.

భివాండిలోని వేర్‌హౌసింగ్ వ్యవస్థను దీని కోసం ఉపయోగించుకోవడం చూస్తుంటే దీని వెనుక ఒక వ్యవస్థీకృత రవాణా నెట్‌వర్క్ ఉన్నట్లు అర్థమవుతోంది. యంత్రాలలో కొకైన్‌ను దాచి దిగుమతి చేసుకోవడం, వాటిని గోదాములలో నిల్వ చేయడం, ఆపై ప్యాకెట్లను వెలికితీసి కింది స్థాయి ముఠాలకు సరఫరా చేయడం వంటి ప్రక్రియలు ఈ నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్నాయి.

సూత్రధారుల కోసం ముమ్మర వేట

ఈ మొత్తం ఉదంతం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, దీనిని పర్యవేక్షించే వ్యక్తులు, ఆర్థిక సాయం అందించేవారు, ఈ మాదకద్రవ్యాలను అందుకోవాల్సిన వారిని పట్టుకోవడానికి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. సాధారణంగా భారత్‌లో ఏటా సగటున 200 నుంచి 300 కిలోల కొకైన్ పట్టుబడుతుంటుంది. అటువంటిది ఒకే ఆపరేషన్‌లో ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయంగా ఉంది.

 

Share.
Leave A Reply

Exit mobile version