నేడు చాలా మంది మొబైల్స్,కంప్యూటర్స్‌తోనే టైమ్ ఎక్కువ గడుపుతున్నారు. దీని వల్ల కళ్ళపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల క్రమంగా చూపు కోల్పోయే అవకాశం ఉంది. దీని వల్ల కళ్ళు బలహీనంగా మారి కళ్ళు సరిగ్గా కనపడకుండా చేస్తుంది. ఈ సమస్యలన్నింటిని దూరం చేసుకోవాలంటే పోషకాహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

  • తక్కువ వెలుతురులో చదివితే చూపు తగ్గిపోతుందని కొందరు అనుకుంటుంటారు. ఇది నిజం కాదు. అయితే మసక వెలుతురులో చదివితే కళ్లు చాలా త్వరగా అలసిసోతాయి. కాబట్టి పుస్తకం మీద నేరుగా వెలుతురు పడేలా లైటును అమర్చుకొని చదువుకోవటం మంచి పద్ధతి.
  • కళ్లకు మేలు చేయటంలో క్యారెట్లను మించినవి లేవనేది మరికొందరి భావన. క్యారెట్‌లోని విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్క క్యారెట్‌లోనే కాదు.. పాలు, ఛీజ్‌, గుడ్డులోని పచ్చసొన వంటి వాటిల్లోనూ విటమిన్‌ ఎ ఉంటుంది. అలాగే తాజా పండ్లు, ఆకుకూరలను తక్కువ చేయటానికీ లేదు. వీటిల్లో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి వయసుతో పాటు దాడిచేసే శుక్లాలు, రెటీనా మధ్యభాగం క్షీణించటం (మాక్యులర్‌ డీజెనరేషన్‌) వంటి సమస్యల బారినపడకుండానూ కాపాడతాయి.
  • కళ్లద్దాలు లేదా కాంటాక్ట్‌ లెన్సులను రోజంతా పెట్టుకోవటం మంచిది కాదని, దీంతో కళ్లు వాటికి అలవాటు పడిపోతాయనేది ఇంకొందరి అపోహ. ఇందులో ఏమాత్రం నిజం లేదు. హ్రస్వ దృష్టి లేదా దూర దృష్టి.. సమస్య ఏదైనా డాక్టర్లు సిఫారసు చేసిన కళ్లద్దాలు లేదా లెన్సులు తప్పకుండా వాడుకోవాలి. సాధారణంగా వయసు మీద పడటం వల్లనో, జబ్బుల మూలంగానో కంటి అద్దాల పవర్‌ మారుతుంటుంది. అప్పుడు కొత్త అద్దాలు తీసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప కళ్లద్దాలు, లెన్సులతో చూపు తగ్గటం, కళ్లు దెబ్బతినటం వంటి ముప్పులేవీ ఉండవు. పైగా అద్దాలు పెట్టుకోకపోతే కళ్లు ఒత్తిడికి లోనవ్వొచ్చు.
  • అదేపనిగా కంప్యూటర్‌ వైపు చూడటం కళ్లకు హానికరమని కొందరు భావిస్తుంటారు. దీంతో కళ్లు అలసిపోవటం, ఒత్తిడికి లోనవటం సహజమే గానీ చూపేమీ దెబ్బతినదు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్‌ ముందు కూచోవాల్సి వస్తే మధ్య మధ్యలో కాసేపు విరామం తీసుకోవటం మంచిది. అలాగే తరచుగా కంటి రెప్పలను ఆడిస్తుండాలనే విషయాన్ని మరవరాదు. దీంతో కళ్లు పొడిబారకుండా చూసుకోవచ్చు.
  • కంటి వ్యాయామాలు చేస్తే కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం తప్పుతుందని కొందరు అనుకుంటుంటారు. కంటి వ్యాయామాలతో కంటి కండరాలు బలోపేతం కావొచ్చేమో గానీ తగ్గిపోయినన చూపు తిరిగి మామూలు స్థాయికేమీ రాదు. కంటి ఆకృతి, కంటి కణజాలం వంటివి కంటి వ్యాయామాలతో మారిపోవు.
    చూపు తగ్గటాన్ని ఆపలేమని మరికొందరు అనుకుంటుంటారు. చూపు మసకబారటం, కంటి నొప్పి, మిరుమిట్లు గొలిపే కాంతులు మెరవటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్‌üను సంప్రతించటం మంచిది. కారణాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే తగు చికిత్సలతో సరి చేయొచ్చు. కనీసం చూపు తగ్గటాన్నయినా నెమ్మదింపజేయొచ్చు.

కంటి ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్..

కంటి చూపుని మెరగ్గా చేయాలంటే కొన్ని ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలని డైటీషియన్స్ చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరగ్గా మారుతుందని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

మెంతులు, బాదం..
మెంతుల్ని నానబెట్టిన నీటిని ఉదయాన్నే తీసుకోవాలి దీంతో రోజుని ప్రారంభిస్తే మంచిది. ఆ తర్వాత ఉదయాన్నే నానబెట్టిన 5 బాదం గింజల్ని తీసుకోండి. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మధ్యాహ్నం లంచ్‌కి..
లంచ్‌లో కూరల్లో మెంతి కూర, ఆలుగడ్డలు, పుట్టగొడుగులు, పన్నీర్ వంటివాటిని ఎంచుకోండి. వీటితో పాటు పాలకూరని యాడ్ చేసుకోవడం మంచిది.

సన్‌ఫ్లవర్ సీడ్స్..
అదే విధంగా మీరు స్మూతీస్, సలాడ్స్ తీసుకుంటే వాటిపై సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని చల్లడం చేయండి. వీటితో పాటు చిలగడదుంపల్ని ఈవెనింగ్ టైమ్‌లో స్నాక్‌గా తినడం మంచిది. వీటితో పాటు వేయించిన పల్లీలను తీసుకోవడం మంచిది.

క్యారెట్, ఆరెంజ్ జ్యూస్..

ఈ రెండు కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడావే. అందుకే భోజనానికి మధ్యలో ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. భోజనం చేసిన తర్వాత ఈవెనింగ్ క్యారెట్ జ్యూస్, ఎబిస్ జ్యూస్ తీసుకోవాలి. దీని వల్ల కంటి ఆరోగ్యం బావుంటుంది.

Share.
Leave A Reply

Exit mobile version