ఇన్సూరెన్స్ రంగం ప్రజల ఆర్థిక భద్రతకు ఎంతో ముఖ్యమైనది. అనారోగ్యం, ప్రమాదాలు, లేదా ఆకస్మిక మరణం వంటి పరిస్థితుల్లో బీమా పాలసీలు కుటుంబాలకు రక్షణగా నిలుస్తాయి. అయితే, ఇటీవలి కాలంలో బీమా మిస్-సెల్లింగ్ (తప్పుదారి పట్టించే విక్రయం) సమస్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. దీనివల్ల పాలసీదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మిస్-సెల్లింగ్ అంటే ఏంటి అంటే, బీమా ఏజెంట్లు లేదా కంపెనీలు పాలసీల అసలు నిబంధనలు, ప్రయోజనాలు పూర్తిగా వివరించకుండా లేదా తప్పుడు సమాచారం ఇచ్చి వినియోగదారులను పాలసీలు కొనుగోలు చేయించడాన్ని అంటారు.
చాలా సందర్భాల్లో అధిక రాబడులు వస్తాయని నమ్మించి వియోగదారులను ఆకర్షిస్తారు. కొన్ని పాలసీల్లో రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పటికీ, వాటిని దాచిపెట్టి “సేవింగ్స్ ప్లాన్” లేదా “గ్యారంటీడ్ రిటర్న్” పేరుతో పాలసీ విక్రయించడం జరుగుతుంది.
పాలసీదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి పాలసీ వివరాలు పూర్తిగా అర్థం కాకపోవడం. చాలా మంది కస్టమర్లు నిబంధనలు చదవకుండా, ఏజెంట్ చెప్పిన మాటలపైనే ఆధారపడతారు. తరువాత క్లెయిమ్ చేసే సమయంలో అసలు నిబంధనలు తెలిసి నిరాశ చెందుతారు. ఉదాహరణకు, కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో కొన్ని వ్యాధులు కవరేజ్‌లో ఉండవు లేదా వేచి ఉండే కాలం ఉంటుంది. ఇవి ముందుగా తెలియకపోతే, అవసర సమయంలో క్లెయిమ్ తిరస్కరణ ఎదురవుతుంది.
మరొక పెద్ద సమస్య అదనపు చార్జీలు మరియు ఫీజులు. పాలసీ కొనుగోలు సమయంలో ఇవి స్పష్టంగా చెప్పకపోవడం వల్ల పాలసీదారులు నష్టపోతారు. అలాగే, కొన్ని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (ULIPs) మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కానీ వీటిని “సేఫ్ ఇన్వెస్ట్మెంట్”గా చూపించడం మిస్-సెల్లింగ్‌లో భాగమే.
ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణం అవగాహన లోపం. గ్రామీణ ప్రాంతాల్లో, లేదా ఆర్థిక విషయాల్లో అవగాహన తక్కువగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని మిస్-సెల్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. అదే విధంగా, కొంతమంది ఏజెంట్లు తమ కమిషన్ కోసం వినియోగదారుల ప్రయోజనాలను పట్టించుకోరు.
భారతదేశంలో బీమా రంగం ప్రజల ఆర్థిక భద్రతకు కీలకమైనది. అయితే, ఈ రంగంలో “ఇన్సూరెన్స్ మిస్-సెల్లింగ్” అనే సమస్య తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు చూస్తే, ఈ సమస్య వ్యక్తిగత స్థాయిని దాటి వ్యవస్థాత్మక లోపంగా మారిందని అర్థమవుతుంది.
నియంత్రణ సంస్థలు అయిన RBI మరియు IRDAI ఈ సమస్యను గుర్తించినప్పటికీ, తగిన కఠిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగింది. పలు కమిటీలు సూచనలు చేసినా, అవి పూర్తిగా అమలు కాలేదు. బ్యాంకులు మరియు బీమా సంస్థల మధ్య బాధ్యత స్పష్టంగా లేకపోవడం కూడా సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది.
బీమా మిస్-సెల్లింగ్ ఒక వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, అది మొత్తం వ్యవస్థలోని లోపాలను ప్రతిబింబించే అంశం. సరైన నియంత్రణ, బాధ్యతాయుతమైన విక్రయ విధానం, మరియు వినియోగదారుల అవగాహన కలిసివస్తే మాత్రమే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుంది.
ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని చర్యలు అవసరం. మొదటగా, వినియోగదారులు పాలసీ కొనుగోలు ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. నిబంధనలు, షరతులు జాగ్రత్తగా చదవాలి. ఏ సందేహం ఉన్నా స్పష్టత తీసుకోవాలి. రెండవది, ప్రభుత్వం మరియు నియంత్రణ సంస్థలు కఠిన నియమాలు అమలు చేసి మిస్-సెల్లింగ్‌పై చర్యలు తీసుకోవాలి. మూడవది, ఆర్థిక సాక్షరత (ఫైనాన్షియల్ లిటరసీ) పెంపొందించాలి.
బీమా ఒక అవసరమైన ఆర్థిక సాధనం. కానీ సరైన సమాచారం లేకుండా తీసుకున్న పాలసీలు ప్రయోజనం కంటే నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, సరైన అవగాహన కలిగి ఉండడం ప్రతి పాలసీదారుడి బాధ్యత.
ఒక ఉదాహరణ :
బ్యాంక్ శాఖలో జరిగిన ఒక సాధారణ సంభాషణ, రెండేళ్ల గందరగోళానికి, భయానికి, సమాధానం లేని ప్రశ్నలకు నాంది పలుకుతుందని 60 ఏళ్ళ శశీరేఖ ఏప్పుడు ఊహించలేదు. తనకు పదవీ విరమణ తరువాత వచ్చిన డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో అడగడానికే ఆమె భర్త ఒక బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ఫోన్ నెంబరు ఇచ్చి అతనితో మాట్లాడామని అన్నారు. ఫోన్ చేసిన తర్వాత విషయం తెలుసుకొని బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అని ఒక వ్వక్తి వారి ఇంటికి వచ్చి పాలసీ గురించి వివరించాడు. “కానీ నిజం చెప్పాలంటే, అమెకు గాని అమె భర్తకు గాని ఏదీ స్పష్టంగా అర్థం కాలేదు. అతను చెప్పినదంతా విని గుడ్డిగా నమ్మేశారు.” వారు తమ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెడుతున్నామనుకున్నారు.
“ఆయన మాకు ఖాళీ అప్లికేషన్స్ చూపించాడు, మేము సంతకాలు చేశాం. వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారని మేము అనుకున్నాం. పదవీ విరమణ తర్వాత మేము మానసికంగా కుదురుకోలేకపోయాం.
సుమారు 20 రోజుల తర్వాత పాలసీ పత్రాలు వచ్చాయి. శశీరేఖ తన పేరు, భీమా మొత్తాన్ని సరిచూసుకుని దాన్ని పక్కన పెట్టింది. ఆమెకు 15 రోజుల ఫ్రీ-లుక్ పీరియడ్ గురించి కాని, సరెండర్ ఆప్షన్ గురించి కాని పాలసీ పత్రాలు పూర్తిగా చదవమని కూడా చెప్పలేదు.
తము తీసుకున్న బీమా పాలసీ తమ వయస్సు వారికి సరిపడదాని ఆమె భర్త గ్రహించడానికి నెలలు పట్టింది. వారికి ఆ పాలసీని అమ్మిన వ్యక్తితో మాట్లాడటానికి వారు బ్యాంకు శాఖకు వెళ్ళినప్పుడు, తమకు పాలసీ ఇచ్చిన వ్యక్తి ట్రాన్ఫర్ అయ్యాడని చెప్పారు. అంతేకాకుండా, వారు మాట్లాడవలసిన వ్యక్తి బ్యాంకుకు చెందినవారు కాదని, ఇన్సూరెన్స్‌కు చెందినవారని కూడా వారికి మొదటిసారిగా చెప్పారు.
తమ బ్యాంక్ బ్రాంచ్ మురియు ఇన్సూరెన్స్ ఇచ్చిన వారు వేర్వేరు సంస్థలని తనకు ఎప్పుడూ తెలియదని శశీరేఖ చెప్పింది. “నేను అవి రెండూ ఒకటే అనుకున్నాను,” అంది ఆమె. “మాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. సమస్య మొదలయ్యాకనే మేమంతా తెలుసుకున్నాం.”
ఆమె చివరకు ఇన్సూరెన్స్ బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నప్పుడు, అక్కడి అధికారి ఆమె పత్రాలను నిశ్శబ్దంగా పరిశీలించారు. ఆ తర్వాత, ఆ పాలసీని ఎందుకు తీసుకున్నారని ఆమెను అడిగారు. ఆ పాలసీ ఆమె వయస్సుకు గానీ, ఆమె ఆర్థిక లక్ష్యాలకు గానీ తగినది కాదని చెప్పారు. ఆమె అవసరాలకు అది “పనికిరానిది” అని చెప్పి, ప్రీమియంలు చెల్లించడం ఆపివేసి, మెచ్యూరిటీ మొత్తం కోసం 15 సంవత్సరాల వరకు వేచి ఉండమని ఆమెకు సూచించారు.
అప్పటికి తన వయసు సుమారు 80 ఏళ్లు ఉంటుందని ఆమె అంచనా వేసుకుంది.
“మేము ఒక ఆఫీసు నుండి మరో ఆఫీసుకు తిరుగుతూనే ఉన్నాము. చివరికి, ప్రాంతీయ కార్యాలయంలోని ఒకరు, పాలసీ 15 సంవత్సరాలు తర్వాత మెచ్యూర్ అయినప్పుడు మాత్రమే డబ్బు వస్తుందని, అది కూడా మనం పెట్టుబడి పెట్టిన దానికంటే కొంచెం తక్కువ మొత్తంలో ఉంటుందని చెప్పారు. దాంతో ప్రయోజనం ఏమిటి? బహుశా అప్పటికి నేను బతికే ఉండకపోవచ్చు,” అని శశీరేఖ అన్నారు.
అప్పటికే ఆ దంపతులు రెండు పాలసీల కింద రూ. 12 లక్షలు చెల్లించారు. అంతకుముందు ప్రారంభించిన వారి కొడుకు పాలసీకి మరో రూ.6 లక్షలు ఖర్చయ్యాయి. వారు తమకు అవసరం లేని పాలసీలకు తమ జీవితకాలపు పొదుపును అంకితం చేశారు. వారు మళ్లీ బ్యాంకును సంప్రదించినప్పుడు, పాత బ్రాంచ్ మేనేజర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బదిలీ అయిపోయారు.
ఆటో-డెబిట్లను నిలిపివేయమని కోరుతూ లేఖ రాయమని కొత్త మేనేజర్ వారికి చెప్పారు. అలా చేసిన తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఫోన్ చేసి, ప్రీమియం చెల్లింపులు చేయమని అడుగుతున్నారు.
దాదాపు ఒక సంవత్సరం పాటు, వారు ప్రాంతీయ కార్యాలయం నుండి స్థానిక కార్యాలయానికి, తిరిగి ప్రాంతీయ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నారు. అన్నిచోట్లా ఒకే రకమైన సమాధానాలు వచ్చాయి. చదవకుండా ఎందుకు సంతకం చేశారని వారిని అడిగారు. ఆ పొరపాటు వారిదేనని చెప్పారు. ఏమీ చేయలేమని చెప్పారు. పాలసీ సరెండర్ చేస్తే చాలా తక్కువ మొత్తం వస్తుందని చెప్పారు.
వారు ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ కు జరిగిన ప్రతి విషయం రాతపూర్వకంగా తెలియజేయడానికి ప్రయత్నించారు. తప్పుడు అమ్మకాలు, సమాచారం వెల్లడించకపోవడం మరియు ఒత్తిడితో పాలసీలను జారీ చేశారని వివరిస్తూ లేఖ రాసారు. దానికి వచ్చిన సమాధానం, అధికారులు వారికి చెప్పిన దానికి దాదాపుగా ఒకేలా ఉంది.

