
ఆహారం మితంగా తింటే అమృతం.. అమితంగా తింటే విషం’గా మారుతుంది. ఇదేంటనుకుంటున్నారా.. భయపడకండి.. అది విషం కాకపోవచ్చు కానీ విషపరిణామాలకు తప్పకుండా దారితీస్తుంది. ఎలా అంటే మీ శరీరానికి అవసరమయ్యే క్యాలరీల కంటే మీరు ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు అదనంగా చేరే క్యాలరీలు కొవ్వులుగా మారతాయి. అవే పొట్ట, పిరుదులు, నడుము.. వంటి శరీరభాగాల్లో పేరుకుపోయి మీ శరీరాకృతినే మార్చేస్తాయి. అంతేకాకుండా హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.. ఫలితంగా మెల్లగా బరువు పెరగడం మొదలవుతుంది. అలా ‘అధిక బరువు’ సమస్య తలెత్తి, అది క్రమంగా వూబకాయానికి దారి తీస్తుంది. ఇంకేముంది.. వూబకాయం అంటేనే వ్యాధుల వూబి. అందులో కూరుకుపోతే ఇక బయటకు రావడం చాలా కష్టం. గుండె సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు.. ఇలా ఒక్కటి కాదు.. రకరకాల వ్యాధులు క్యూ కడతాయి. దీనికి తోడు ఇప్పుడు మారుతున్న జీవన విధానాల వల్ల వేళకు తినకపోవడం, నిద్రపోకపోవడం.. బయటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్స్.. ఇలాంటివన్నీ బరువు పెరగడానికి పూలబాటలు వేస్తున్నాయి.!
ఈ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం. అదేంటంటే, బరువుని అదుపులో పెట్టుకోవడం. అవునండీ, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మీ శరీరాకృతి బాగుండాలన్నా.. బరువు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఈ విషయం ఇప్పటికే చాలామంది గ్రహించారు. అందుకే బరువు తగ్గడానికి కసరత్తులు ప్రారంభించారు. కానీ, ఎంత వ్యాయామం చేసినా.. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీరు మళ్లీ ఆ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ముందు నుంచి వాటి గురించి తెలుసుకుని అవి పాటించడం ద్వారా తేలికగా మీ జీవనాన్ని సాగించవచ్చు.
ఈ జాగ్రత్తలు తెలుసుకోండి..
శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంతో పాటు.. రోజూ తీసుకునే ఆహారం ద్వారా కొవ్వు పేరుకోకుండా చూసుకోవాలి. అంటే నెగెటివ్‌క్యాలరీ ఫుడ్ తీసుకోవడం లేదా తీసుకున్న ఆహారానికి సరిపడా పని చేయడం వంటివి తప్పకుండా చేయాలి. వీలున్నంత వరకు ఆహారం మితంగా తీసుకోవడం మంచిది. రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే ఫ్యాట్ లెవెల్స్ తొందరగా తగ్గుతాయి. అలాగే మీరు ఎలాంటి వ్యాయామాలు చేస్తే ఫలితం ఉంటుందో నిపుణుల్ని సంప్రదించి తెలుసుకోండి. ఎందుకంటే వయసుని బట్టి, శరీర బరువుని బట్టి వాటిని చేయాల్సి ఉంటుంది. అందుకే సొంతంగా కాకుండా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
పోషకాహారం తీసుకోవాలి
బరువుని అదుపులో ఉంచుకోవడానికి ఎంత వ్యాయామం చేసినా వాటితో పాటు ఆరోగ్యవంతమైన ఆహారపద్ధతులకు స్వాగతం చెప్పాల్సిందే. అందులో భాగంగా ముందు జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌కు పూర్తిగా స్వస్తి చెప్పేయాలి. శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించే సమతులాహారం మితంగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తినడం కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది. కానీ, మీరు తీసుకునే ఆహారం ద్వారా అదనపు క్యాలరీలు అందకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా ఏదన్నా తింటే అందుకు తగ్గ కసరత్తులు చేసి, వాటిని ఖర్చు చేయాల్సిందే.
ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్ మానేయాలి. వాటి బదులు తాజా పళ్లరసాలు తాగాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కాయగూరలు, పండ్లు. ఆహారంలో చేర్చుకోవాలి. స్వీట్స్, పొటాటో చిప్స్, బర్గర్లు.. పిజ్జాలు.. వంటివి అస్సలు తినకూడదు. అలాగే మీరు తినే ఆహారపదార్థాల్లో ఉప్పు తగ్గించి తీసుకోవడం మంచిది. ఇవన్నీ పాటించడం ద్వారా మీ బరువు ని చక్కగా అదుపులో పెట్టుకోవచ్చు.
శ్రమ పడండి…
ఎన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. వ్యాయామాలు చేస్తున్నా.. మీ జీవన విధానాన్ని కూడా కాస్త మార్చుకుంటేనే మీరు ఉత్సాహంగా ఉంటారు. టీవీ, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చోవడం కంటే మీ పిల్లలతో కలిసి కాసేపు సరదాగా ఆటలు ఆడండి. లేదంటే శరీరానికి శ్రమ కల్పించండి. లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి. రోజూ కాసేపు నడవండి. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి చిన్న పనికీ యంత్రాల పైన ఆధార పడటం తగ్గించండి. అది మీ శరీరానికి మేలు చేస్తుంది. వ్యాయామాలతో పాటు సహజంగా బరువు తగ్గడానికి ఈ పద్ధతులన్నీ సహకరిస్తాయి.
వీటన్నింటితో పాటు సహజంగా బరువు తగ్గడానికి ఉపయోగపడే చిట్కాలు కొన్ని;
- గ్లాసు నీళ్లలో మూడు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా తేనె, కాస్త మిరియాల పొడి కలిపి మూణ్నెల పాటు ఉదయాన్నే రోజుకోసారి తాగండి.
- క్యాబేజీని మీ ఫుడ్‌లిస్ట్‌లో చేర్చుకోండి.. ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది.
- అల్లం, నిమ్మకాయ ముక్కల్ని నీళ్లలో మరిగించి అవి గోరువెచ్చగా అయ్యాక తాగండి. తినాలన్న కోరికను అదుపులో ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
- కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి.
- మీకు టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే వాటికి బదులు గ్రీన్‌టీని ఎంచుకోవడం ఉత్తమం.
ఈ చిట్కాలు పాటిస్తూ.. బరువుని అదుపులో ఉంచుకుంటూ కొవ్వు నిల్వలు తగ్గించుకోండి. ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండండి.


