
పండ్లు మనకు వరం!
వేసవి వేడి నుంచి తట్టుకోవడానికి ఈ కాలంలో వచ్చే కొన్ని పండ్లు మనకు వరంలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మామిడి, నేరేడు, తాటి ముంజలు, పుచ్చకాయ, తర్బూజా, పనస, రాంజనా, కర్వంద్.. వంటి పండ్లు అటు రుచికి రుచితో పాటు శరీరానికి చలువను అందిస్తాయి.
డీహైడ్రేషన్ బారిన పడకుండా..
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం తప్పనిసరి. అయితే నీళ్లతో పాటు నిమ్మరసం, మిల్క్‌షేక్, కోకుమ్ పండుతో చేసిన షర్బత్, గుల్కండ్ (గులాబీ ఆకులతో చేసిన స్వీట్), ఆమ్ పన్నా, సత్తు డ్రింక్ (శెనగలు-బెల్లం కలిపి సత్తుపిండితో చేసే పానీయం), అంబలి, కొబ్బరి లేదా తాటి చెట్టు నుంచి సేకరించిన కల్లు.. వంటివన్నీ తీసుకోవాలి. వీటితో రుచే కాదు.. శరీరానికి ఎక్కువ మొత్తంలో నీరు అందుతుంది.
భోజనానికి ఇవి..డ్రింక్స్, పండ్లే కాదు.. మనం రోజూ రెండు పూటలా తీసుకునే భోజనం విషయంలోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవాలి. పెరుగన్నం-అప్పడాలు కలిపి తీసుకోవడం, జొన్నల్ని బాగా ఉడికించుకొని సబ్జీ (అన్ని కూరగాయలను కలిపి చేసే కర్రీ)తో కలిపి తినడం, గంజి, పోహా (లావు అటుకులతో చేసే రెసిపీ) – పెరుగు, అన్నం – కైరీ కాధి (పచ్చి మామిడి కాయలు, శెనగపిండితో చేసే చిక్కటి పులుసు) ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్‌ని భోజనంలో భాగంగా తీసుకోవాలి. ఫలితంగా ఇవి అధిక వేడి నుంచి శరీరాన్ని కాపాడి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.
అందానికి ఈ చిట్కాలు..!
ఎండ వేడి ఆరోగ్యం పైనే కాదు.. చర్మ సౌందర్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో అందాన్ని సంరక్షించుకోవడానికి ఈ మూడు చిట్కాల్ని పాటించేయండి..
- పిడికెడు వేపాకుల్ని స్నానం చేసే నీటిలో వేయండి.. ఓ గంట తర్వాత ఆ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడంతో పాటు ఆ నీళ్లు ముఖంపై పడడం వల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
- వేసవిలో మధ్యాహ్నం పూట నిద్ర రావడం, అలసిపోయినట్లుగా అనిపించడం, వేడి-చెమట వల్ల చిరాగ్గా అనిపించడం సహజం. మరి వీటి నుంచి బయటపడాలంటే భోజనంలో భాగంగా పెరుగు లేదా మజ్జిగను తప్పకుండా తీసుకోవాలి. వీటివల్ల చర్మం తేమను సంతరించుకోవడంతో పాటు ఈ కాలంలో వేధించే పిగ్మెంటేషన్, ఎండకు చర్మం కమిలిపోవడం.. వంటి పలు రకాల చర్మ సమస్యలకూ చెక్ పెట్టచ్చు.
- ఈ కాలంలో ఎండ వేడి వల్ల చెమట, చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వెలువడడం సహజం. మరి, దాన్ని తగ్గించుకోవాలంటే శుభ్రపరిచిన వట్టి వేర్లను మనం తాగే నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆపై ఆ వేర్లను తొలగించి ఆ నీటిని తాగితే సరిపోతుంది. అంతేకాదు.. ఈ చిట్కా వల్ల చర్మ రంధ్రాలు బిగుసుకుపోయి చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.


