‘రాజకీయం బాధ్యత.. అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గమని నేను నమ్ముతా. అదే భావనతో జనసేన పార్టీని స్థాపించా. ఓట్లు, సీట్ల లెక్కలు వేసుకోకుండా ప్రజలకు మేలుచేసే దారిలో ముందుకెళ్లాం. ప్రజలు దాన్ని అర్థం చేసుకుని ఆశీర్వదించారు. తమిళనాడు ప్రజలకు మేలుచేసే విషయాల్లో అవసరమైన తోడ్పాటు అందిస్తాం’ అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో తమిళనాడుకు చెందిన రచయిత, పర్యావరణ ఉద్యమకారుడు కేఎస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో తమిళ రచయిత, పబ్లిషర్ మరవన్‌పులవు కె.సచ్చిదానందన్, ఎంజీఆర్ మనవడు సత్యరాజేంద్రన్, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యావంతులతో కూడిన బృందం శనివారం పవన్ కల్యాణ్‌తో సమావేశమైంది. తమిళనాడులోని వర్తమాన రాజకీయ, పాలనాపరమైన పరిస్థితులు, ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, సంస్కృతి, ధర్మపరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
‘తమిళనాడులోని సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. వాటి పరిష్కారానికి జనసేన తన వంతు తోడ్పాటు అందిస్తుంది. ప్రజలకు మేలు చేకూరాలంటే బలమైన నాయకత్వం ఉండాలి. అప్పుడే భద్రంగా ఉన్నామనే భావన ప్రజల్లో కలుగుతుంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం ఎంతటి శక్తిసామర్థ్యాలతో ఉన్నామో ప్రపంచం గుర్తించింది. అందుకు దేశానికి బలమైన నాయకత్వం ఉండటమే కారణం. సమాజంలో ఐక్యత ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం’ అని స్పష్టం చేశారు. ‘మాజీ సీఎంలు ఎంజీఆర్, జయలలితలు శాంతిభద్రతలతోపాటు భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ స్ఫూర్తిని కొనసాగించాలి’ అని సూచించారు. ‘ఎన్నో విశిష్టతల సమాహారం ద్రవిడ భూమి. ఏ రాష్ట్రంలో అయినా స్థిరమైన నాయకత్వం కావాలంటే ఎన్నికల్లో ఓట్ల చీలికను అరికట్టడం ముఖ్యం. దేశాభివృద్ధికి భవిష్యత్తు రాజకీయాల్లో బలమైన పొత్తు అవసరం ఉందని నమ్ముతా. దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుంది’ అని వివరించారు.
