పండే విషంగా మారితే.. కూరగాయలే నిలువెల్లా గాయాలు చేస్తుంటే… అచ్చంగా ఇదే జరుగుతోంది. పండ్లు, కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్లోరోపైరిఫాస్ రసాయన వాడకం వల్ల దాని అవశేషాలు ఉండిపోయి వాటిని తిన్నవారిలో అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక, ప్రమాదకర వ్యాధులతో ఆ ఉత్పత్తులను నేరుగా తినడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పండ్లు, కూరగాయల పంటల్లో పురుగుల నివారణకు రైతులు ఇది వాడుతున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో వరి, కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్ల జాతుల పంటల్లో క్లోరోపైరిఫాస్ వినియోగం ఎక్కువగా ఉంది. ఇతర రకాల మందులతో కలిపి దీన్ని చల్లుతున్నారు. దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
పురుగులను నివారించేందుకు..
లద్దెపురుగు, శనగపచ్చ పురుగు, గులాబీరంగు పురుగు, పచ్చపురుగు, ఆకుచుట్టు పురుగు, మొవ్వ పురుగు తదితరాలు.. పంటలను నాశనం చేస్తున్నాయి. వీటి నివారణకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్లోరోపైరిఫాస్ చల్లుతున్నారు. ఎకరాకు అర లీటరు సిఫార్సు ఉన్నా అధికంగా వాడటంతో దాని అవశేషాల వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాస్తవానికి క్లోరోపైరిఫాస్ పిచికారీ చేసిన వారం రోజుల తర్వాతే పండ్లు, కూరగాయలు కోయాలి. చాలామంది రైతులు మందు చల్లిన రెండు లేదా మూడు రోజులకు కోసేస్తున్నారు. కొందరు మోతాదుకు మించి చల్లుతున్నారు.
ప్రత్యామ్నాయాలు వాడితే….
పంటల్లో పురుగు నివారణకు ఇటీవల నూతన క్రిమిసంహారకాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పురుగులను వేగంగా చంపటానికి అధిక గాఢత కలిగిన కొత్త రకాల మందులను రైతులు క్లోరోపైరిఫాస్‌తో కలిపి వాడుతున్నారు. పూత వచ్చిన సమయం నుంచి కాయ ఏర్పడే దశ వరకు ఈ మందు చల్లితే అవశేషాలు కాయ లోపల ఉండిపోతున్నాయి.
