రైతు సేవ కేంద్రాల్లో పని చేసే అసిస్టెంట్లకు శిక్ష్లణ
13 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాలు
ఏపీ స్టేట్ బ్యూరో,
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రైతు సాధికార సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. రామారావు స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం ఆరంభమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవ కేంద్రాలలో పనిచేసే వి ఏ ఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లు), వి హెచ్ ఏ (విలేజ్ హర్టీకల్చర్ అసిస్టెంట్ లు) లకు ప్రకృతి వ్యవసాయంపై సంపూర్ణ అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో శిక్షకులను తయారు చేయడం కోసం ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ కు చెందిన అధికారులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి శిక్షణ ముగిసిన అనంతరం ఇక్కడ శిక్షణ పొందిన శిక్షకులు జిల్లాలలో డివిజన్ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతు సేవ కేంద్రంలో పని చేసే సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
ఈ సంధర్భంగా శిక్షణా కార్యక్రమ ప్రారంభోపన్యాసంలో సీఈఓ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 11.60 లక్షల మంది రైతులు 13 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం విధానాలు అనుసరిస్తున్నారని, నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ గా గుర్తించ బడ్డ రైతు సాధికార సంస్థ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినదని అన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతుల సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం, నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు. మూడు రోజుల శిక్షణలో నేర్చుకొన్న అంశాలను గ్రామ స్థాయి వరకు చిత్త శుద్ధితో తీసుకువెళ్లాలని సూచించారు.

ఈ సంధర్భంగా రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్ డీవీ రాయుడు మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభంలో ఉందనే విషయం అందరికీ తెలుసునని, ప్రకృతి వ్యవసాయంను ప్రత్యామ్నాయంగా రైతులందరి చెంతకు తీసుకువెళ్ళి రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలని అన్నారు. మహిళా సంఘాల సహకారంతో గతంలో కూడా సుస్థిర వ్యవసాయం కోసం కృషి చేయడం జరిగిందని, మనమందరం ప్రకృతి వ్యవసాయ ఛేంజ్ ఏజెంట్ లు గా వ్యవహరించి రైతులందరినీ ప్రకృతి వ్యవసాయం లోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి హాజరైన డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే ప్రకృతి వ్యవసాయం ను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చునని తెలిపారు. ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో మీలోని సందేహాలను నివృత్తి చేసుకోవాలని శిక్షకులకు సూచించారు.
ఈ సంధర్భంగా ప్రకృతి వ్యవసాయం వెనుక దాగిఉన్న సైన్స్ పై రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి. విజయ్ కుమార్ చేసిన వీడియో ప్రసంగం ప్రదర్శించారు.
