మహానాడు వేదికగా పలు మార్పులు

ఏపీ స్టేట్ బ్యూరో,

మరో వారం రోజుల్లో టీడీపీ మహానాడు కడపలో జరగనున్నది. ఈ కార్యక్రమాన్ని వేదికగా తీసుకుని పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా మంత్రి లోకేష్ అనుచరులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ నేతకు ఎటువంటి పదోన్నతి లభించనున్నది అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. కొందరైతై పార్టీ పరంగా పదోన్నతి లభిస్తుందని చెబుతుంటే మరి కొందరు మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. లోకేష్ తోపాటు పార్టీలో మిగిలిన నాయకులకు ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలనా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొన్ని ప్రత్యేక పనులపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ప్రధానంగా ఏపీకి రానున్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనే ఎక్కువుగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిథ పథకాల అమలు, వాటిలోని లోటుపాట్లపై అధికారులతో ఎక్కువుగా చర్చలు కొనసాగిస్తున్నారు. వయస్సు రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సచివాలయానికి ఉదయం 11 గంటల సమయంలో వెళ్లడం, సమావేశాలు, సమీక్ష్లలను సాయంత్రం 6 గంటల్లోపు పూర్తి చేస్తూ సమయానికి ఇంటికి వచ్చి విశ్రాంతి  తీసుకుంటున్నారు. వారానికో, పది రోజులకో పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళుతున్నారు. మిగిలిన పనులన్నింటిని మంత్రి లోకేష్ చూసుకుంటున్నారు. అయితే పార్టీకి, నాయకులకు లోకేష్ కు దూరం పెరగకుండా ఉండేందుకు అనువుగా కీలకబాధ్యతలు అప్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక నలభై సంవత్సరాలకు సంబంధించిన ప్లానింగ్ లో చంద్రబాబు సిద్ద హస్తుడు కావడంతో  తెలంగాణాలోనూ పార్టీని గ్రామస్ధాయిలో తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే భావనలో ఉన్నారు.

ఈ నేపధ్యంలో లోకేష్ కు పార్టీ జాతీయస్ధాయి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉంచాలనే భావనలో ఉన్నట్టు సన్నిహితులు కథనం. రాష్ట్ర అధ్యక్ష్లులుగా పల్లా శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నారు. అటు జాతీయ స్ధాయిలో లోకేష్, ఏపీ స్ధాయిలో శ్రీనివాస్ ఉంటే పార్టికి సంబంధించిన అన్ని పనులు సవ్యంగా జరిగే అవకశాలు ఉంటాయనే భావన పార్టీలోనూ వినపడుతోంది. ఈ నేపధ్యంలోనే లోకేష్ కు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి ఖాయంగా వస్తుందని అంతా భావిస్తున్నారు. అలాగే పార్టీలో సమూల ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కొత్త టీంల రూపకల్పన పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే  సీనియర్ల బాధ్యతలు మారనున్నాయి. దీంతో, మహానాడు వేదికగా చేసే నిర్ణయాల పైన పార్టీ – కూటమిలో ఉత్కంఠ పెరుగుతోంది.

 తాజాగా జరిగిన పాలిట్ బ్యూరో సమావేశం లొ లోకేష్ మండల స్థాయి నుంచి ఏ నేత వరుసగా మూడు సార్లు కంటే వరుసగా పదవుల్లో కొనసాగరాదని ప్రతిపాదన చేయగా, ఆమోదం లభించింది. ఇదే ఫార్ములా పార్టీ జాతీయ – రాష్ట్ర కమిటీ ల్లోనూ అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.  కీలక పదవి టీడీపీలో ప్రస్తుతం నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా లోకేష్ చేసిన ప్రతిపాదన తో ఇప్పుడు లోకేష్ ను ఆ పదవి కంటే మెరుగైన పదవి లేదా మార్పు చేయాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోకేష్ కు ప్రమోషన్ మాత్రమే దక్కే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిండెట్ పదవి లేదంటే కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. అదే విధంగా సుదీర్ఘ కాలంగా పార్టీ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న సీనియర్ల కు స్థాన చలనం తప్పేలా లేదు. వారిలో కొందరి ని కొనసాగిస్తూ యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో, మహానాడు వేదికగా తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Post Views: 38