వడ్డే శోభనాద్రీశ్వరావు ప్రశ్న
ఏపీ స్టేట్ బ్యూరో,
కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి ఏపీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరావు కోరారు. పరిశ్రమలు రావాలి,పెట్టుబడులు రావాలని తాపత్రయం తప్ప రైతులకు న్యాయం జరగాలని ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నూటికి 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని వడ్డే శోభనాద్రీశ్వరావు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి, రైతుల ఆత్మహత్యలు అరికట్టడానికి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ పలు సూచనలు చేసిందని రైతు సంఘాల సమన్వయ సమితి ఏపీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరావు తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలో మీడియాతో వడ్డే శోభనాద్రీశ్వరావు మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చారని వడ్డే శోభనాద్రీశ్వరావు తెలిపారు. పక్క రాష్ట్రాల్లో పలు రకాల పంటలపై ఎంఎస్పీ మీద బోనస్‌లు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో 50 శాతం కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు. కౌలుదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలుదారులు నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి వస్తుందని చెప్పారు. కొన్ని పంటలను ఏపీలో కొనే పరిస్థితి లేదని, పొగాకు పంట కొనడం లేదని అన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి తాము వ్యతిరేకం కాదు, కానీ వారికి కోరినంత భూమి ఇవ్వడం సరికాదని వడ్డే శోభనాద్రీశ్వరావు పేర్కొన్నారు.
