యోగాంధ్ర మనందరిదీ-మంత్రి లోకేష్
యోగాంధ్ర ఏర్పాట్లపై ఉన్నత స్ధాయి సమీక్ష
ఏపీ ఎనాలిసిస్, విశాఖపట్నం
ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం ప్రజలందరిదీనని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ వేడుక నిర్వహణను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ నగరం వైపు చూస్తోందన్నారు. ప్రధాని మోదీ, పలువురు ముఖ్యులు హాజరవుతున్నందున ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. మంగళవారం విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్ హాలులో యోగాంధ్ర ఏర్పాట్లపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ. పరిధిలో 247 కంపార్టుమెంట్లలో 5 లక్షల మందితో నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించనుంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలూ భాగస్వాములు కావాలి. ప్రధాని వేదికపైకి చేరుకునే గంట ముందే ప్రజలంతా ఆయా కంపార్ట్మెంట్లలోకి చేరేలా రవాణా సౌకర్యం కల్పించాలి. దూర ప్రాంతాల్లో వాహనాలు నిలిపి వారిని ఇబ్బందులకు గురిచేయొద్దు’ అని స్పష్టం చేశారు.
