కుంకి ఏనుగులు విధుల్లోకెఫ్పుడు..
రెండు నెలల నుంచి కొనసాగుతున్న తర్ఫీదు.
ప్రభుత్వ చర్యల పట్ల అటవీ పరిసర ప్రాంతాల నుంచి నిరసన
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
కుంకి ఏనుగులు ఎప్పుడు విధుల్లోకి దిగుతాయి. తమ ఆస్తి, ప్రాణాలను ఎప్పుడు కాపాడతాయని చిత్తూరు, ఒడిస్సా సరిహద్దుల్లోని శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల ప్రజలు అడుతున్నారు. ఏనుగుల మంద గ్రామాలపై పడి ఆస్తులను ద్వంసం చేయడమే కాకుండా ఒకరి ఫ్రాణాన్ని కూడా బలి తీసుకున్నాయి. ఇటీవలనే కర్నాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగుల పనితీరుపై ప్రజల నుంచి ప్రశ్నల వస్తున్నాయి.
అడవి ఏనుగుల్ని మళ్లీ అడవిలోకి తరిమికొట్టాడానికి కర్నాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువస్తామని అధికారంలోకి వచ్చాక ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన రెండుసార్లు కర్నాటక వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. గత మే నెలలో ఆయన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా నాలుగు ఏనుగుల్ని ఎంతో వేడుకగా స్వీకరించారు. తమ రాష్ట్రంలో 3,695 ఏనుగులు ఉన్నాయని, ఏపీకి అవసరం కావడంతో కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ పొందిన ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. ఈ ఏనుగుల విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో చొరవ చూపారని ఆయన వల్లే కుంకీ ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు తెలిపారు. రంజన్ (26), దేవ (39), అభిమన్యు (14), కృష్ణ (15) అనే ఏనుగుల్ని ఏపీకి అప్పగించగా మరో రెండు ఏనుగుల్ని త్వరలో ఇస్తామని తెలిపారు.
రెండు నెలలైనా ఒక్క కుంకీ ఆపరేషన్ లేదు
స్వీకరించిన ఈ ఏనుగుల్ని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్ లో ఉంచారు. అవి వచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ నిర్వహించలేదు. ఎందుకని ఆరా తీయగా వాటికి కుంకీ ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఆపరేషన్ సంగతి దేవుడెరుగు కనీసం వాటిని పోషించడం కూడా దండగని అటవీ శాఖాధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అందులో దేవ అనే ఏనుగు ఒక కంటితో మాత్రమే చూడగలదని అటవీ శాఖాధికారులు గుర్తించారు.
మరో ఏనుగు రంజన్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో దాన్ని అదుపు చేయడం శిక్షణ పొందిన మావటీల వల్ల కూడా కావడంలేదంటున్నారు. మిగతా రెండు ఏనుగులకు సైతం కుంకీ ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదు. ఎందుకూ పనికిరానివి కావడంతో కర్నాటక ప్రభుత్వం బహుమతి పేరుతో వాటిని మనకు అంటగట్టేసింది. దాన్ని పవన్ తన ఘనతగా ప్రచారం చేసుకున్నారు. తీరా ఇప్పుడు విషయం తెలిశాక మన అటవీ శాఖ కక్క లేక మింగలేక నీళ్లు నములుతోంది. వాటికి అసలు కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ ఇచ్చే పరిస్థితి లేదు. అదేమీ చేయకపోగా అవి ఉన్నంతకాలం వాటిని అటవీ శాఖ భరించాల్సిందే.
ఒక ఏనుగును క్యాంప్ లో పెంచాలంటే ఏడాదికి రూ.25 లక్షలు ఖర్చువుతుంది. వాటికి ఆహారం, సౌకర్యాలు, వైద్యం వంటివన్నీ చూసుకోవాలి. అంటే నాలుగు ఏనుగులకు ఏడాదికి కోటి రూపాయల ఖర్చు. మరో 25 ఏళ్లపాటు ఈ ఖర్చు పెట్టాల్సివుంటుంది. పవన్ కళ్యాణ్ అత్యుత్సాహం, ఏపీ అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగం లేని ఏనుగుల్ని తెచ్చి కూటమి ప్రభుత్వం నెత్తిన పెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలో తెలియక మదనపడుతోంది.
ఈ నేపధ్యంలోనే అడవి ఏనుగుల నుంచి అటవీ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయి అనేది పరిశీలించడానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్న క్రమంలో… అవి వెళ్ళే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాలవారిని అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. గ్రామాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటికి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు, హెచ్చరిక సందేశాలు పంపించడాన్ని డి.ఎఫ్.ఓ. కార్యాలయాలు, పి.సి.సి.ఎఫ్. కార్యాలయం పర్యవేక్షించాలన్నారు.
వీటితోపాటు ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా, అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ప్రకటన పట్ల రైతులు, ఆయా గ్రామాల ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. అనూహ్యంగా, ఆకస్మికంగా ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి పడతాయని, ఆ సమయంలో రైతులు, అటవీశాఖ అధికారుల వల్ల కూడా వాటిని అదుపు చేయడం, అడవుల్లోకి తరిమి కొట్టడం సాధ్యమయ్యేు పనికాదని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే కుంకి ఏనుగులతో ఆపరేషన్ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
—-
