అగమ్య గోచరంగా ఉప ఎన్నిక అభ్యర్ధులు
అధినేత్రి షర్మిల ప్రచారమే చేయలేదు.
ఎన్నికల అవకతవరకలపై సంచలనం రేపిన రాహుల్ ప్రకటనలు
వాటిపై స్పందించని ఏపీ కాంగ్రెస్ -అంతర్మధనంలో సీనియర్లు
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
ఏపీ కాంగ్రెస్ అధినేత వైఎస్ షర్మిలా వైఖరి ఇటీవల చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రధాన అంశాలపై ఇటీవల అమె స్పందించక పోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అంతర్మధనం ప్రారంభం అయింది. తెలుగుదేశం, వైసీపీ పార్టీలపై సందర్బోచితంగా విరుచుకుపడుతూ వార్తల్లో వ్యక్తిగా, ఒక ప్రధాన పార్టీ అధినేతగా గుర్తింపు పొందుతూ వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఆమె సోదరుడు వైఎస్ జగన్ పట్ల వంద అడుగులు ముందుకు వేసి మరీ విమర్శలు చేశారామె. కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదిని విమర్శించడానికీ వెనుకాడలేదు. ఇంత క్రియాశీలకంగా వ్యవహరించే ఆమె ప్రస్తుత ఉప ఎన్నికలు, రాహుల్ గాంధీ ప్రకటన పట్ల ఉదాశీనంగా ఉండటం కాంగ్రెస్ నాయకులకు కూడా నచ్చడం లేదు. మిగిలిన వారు ముఖ్యంగా వైసీపీ నేతలు అమె కేవలం తమ నేత వైఎస్ జగన్ ని విమర్శించడానికే పదవీ బాధ్యతలు స్వీకరించారంటున్నారు.
రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నికలపైనే నడుస్తుంది. టీడీపీ, వైసీపీ పార్టీల పోరు తీవ్రంగా ఉంది. జగన్ తన ఉనికిని కాపాడుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా ప్రచారం చేస్తున్నారు. పోలీసులు బైండోవరు కేసులు పెడుతున్నా, బెదిరింపులకు పాల్పడుతున్నా పార్టీ గెలుసు కోసం అహరహం శ్రమిస్తున్నారు. టీడీపీ అంతక మించి పని చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పార్టీ నేతలకు ఒక పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో గెలిచి కనపడాలని నాయకులకు చెప్పారు. దీంతో వారంతా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మేమూ పోటీ చేస్తాం…మా పార్టీ ఉనికిని కాపాడుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిలా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొయిళ్ల శివకల్యాణ్ రెడ్డి, పూల విజయభాస్కర్ లు తన అభ్యర్ధులుగా నిలబెట్టారు. ఇద్దరు అభ్యర్ధులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధినేత్రి నిర్ణయం పట్ల ప్రారంభంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా, పోటీలో నిలిచి పార్టీ ఉనికిని కాపాడేందుకు షర్మిలా చేసిన ప్రయత్నం పట్ల అంతా హర్షం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్ధుల గెలుపునకు దోహదపడుతున్నారు. ఈ నేఫధ్యంలోనే తమ అధినేత్రి షర్మిలా ప్రచారానికి వస్తారని వారంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రచారం మాట దేముడెరుగు..ఆమె అభ్యర్ధుల గెలుపునకు సంబంధించి ఆమె విజ్ఞప్తి చేయకపోవడం గమనార్హం. నిజానికి ఆమె ఆ రెండు చోట్ల ప్రచారం నిర్వహించాలి. కానీ ఆ పని చేయకపోగా, అసలు ఎన్నికలతో, రాజకీయాలతో సంబంధం లేదన్నట్టు ఆమె వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమైంది. స్ధానిక కాంగ్రెస్ నేతలు, తులసి రెడ్డిలు మాత్రమే అభ్యర్ధుల తరఫున ప్రచారం చేశారు. అంతకు మించి ఏమీ జరగకపోవడంతో కాంగ్రెస్ పోటీ కాగితాలకే పరిమితం అయిపోతుందనే విమర్శలు వస్తున్నాయి
మరో విషయమేమంటే…ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నిక అవకతవకలపై చేసిన ప్రకటనలు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఆధారాలతో సహా ఎన్నికల్లోని అవకతవకలను ఆయన వివరించారు. రాహుల్ మీడియా సమావేశాన్ని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో లైవ్ ఇవ్వగా, ఏపీ కాంగ్రెస్ మాత్రం అసలు పట్టించుకోలేదన్న విమర్శ వుంది. మొన్నటి ఎన్నికలో తెలుగుధేశం పార్టిక ఇన్ని సీట్లు రావడం పట్ల ప్రజల్లో అనేక సందేహాలు లేకపోలేదు. కొంత మంది నాయకులు గత ఎన్నికల్లో ఏవీఎంల లల్లో మోసం జరిగిందనే విమర్శలు చేశారు కూడా . ఇదే విషయాన్ని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ వెల్లడిస్తే ఏపీ అధినేత షర్మిలా కనీసం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ పార్టీ నేతలెవరూ రాహుల్ కు అనుకూలంగా ప్రకటనలు, కార్యక్రమాలు చేయలేదు. ఈ రెండు ప్రధాన అంశాలపై షర్మిలా అనుసరిస్తున్న వైఖరి ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్రస్ధాయిలో చర్చనీయాంశంగా మారింది.
