భారీ సంఖ్యలో తరలి రానున్న కాపు సామాజిక వర్గం
స్వాగత ద్వారాలతో కొత్త రూపు సంతరించుకున్న మచిలీపట్నం
మన కులాన్ని ప్రేమిద్దాం-ఇతర కులాలను గౌరవిద్దాం అనే విధానం
ఎం.గణేశ్, జర్నలిస్టు
కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో నోములు, వ్రతాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. నదీ స్నానం, దీపారాధన కూడా విశేష ఫలితాలను ఇస్తాయని ఇతిహాసాలు చెబుతున్నాయి. అనాదిగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. క్రమంగా కార్తీక మాసాన్ని అన్ని వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, సామాజిక వర్గం, రాజకీయ పార్టీల ప్రతినిధులు సామాజికపరంగా సామూహికంగా కలుస్తున్నారు. కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. కలిసి భోజనాలు చేస్తున్నారు. ఐక్యంగా ఉంటూ అభివృద్ది బాటలో పయనిద్దామని ప్రతిన బూనుతున్నారు. ఇందులో ఏ వర్గం మినహాయింపు కాదు. ఇలా సమావేశం కావడం వలన ఆ వర్గాల్లో ఐక్యత కొంత వరకు ఫరిఢవిల్లుతోంది. పుణ్యం, పురుషార్ధం లభిస్తోంది 


మచిలీపట్నంలో ఈ నెల 9వ తేదీన కాపు కుటుంబీకుల కార్తీక మాస వనభోజన మహోత్సవం జరగనున్నది. ఉదయం 8 గంటలకు కేధారేశ్వర స్వామి వారి వ్రతంతో ప్రారంభమై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చిలకలపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని కొండపల్లి సోమయ్య ఎస్టేట్ లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘మన కులాన్ని ప్రేమిద్దాం-ఇతర కులాలను గౌరవిద్దాం’ అనే నినాదంతో మచిలీపట్నం కాపు యువసేన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జనబలం కలిగిన కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వ స్ధాయిలో సముచిత రీతిలో గుర్తింపు రావాలనే ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమం వెనుక లేకపోలేదు. దాదాపు 20 వేలకుపైగా తమ సామాజికవర్గానికి చెందిన వారిని ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే సంకల్పంతో ఏర్పాట్లు చేస్తుంది. కాపు సామాజిక వర్గంలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖుల పేరున స్వాగత ద్వారాలు మచిలీపట్నం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేశారు. వారి సేవలను నేటి కాపు సామాజిక వర్గానికి విశద పరిచే రీతిలో ఈ స్వాగత ద్వారాలు ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రధానంగా బ్రిటీష్ పోలీసులు లాఠీ దెబ్బలను భరిస్తూనే మచిలీపట్నంలో జాతీయ జెండా ఎగుర వేసిన జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త, అపర సోక్రటీస్ రఘుపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు ఎస్ వీ రంగారావు, శాసన సభ్యులు, కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన వంగవీటి మోహన రంగా, ఆరు దశాబ్దాలపాటు జాతీయ స్ధాయిలో క్రికెట్ క్రీడాకారునిగా వినుత కెక్కిన సీకె నాయుడు వంటి ప్రముఖుల పేరున స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.
