ఒక చేయూత… వందల కలలకు వెలుగు
370 మంది విద్యార్థుల జీవితాల్లో ఆశల దీపం
మానవీయతను చాటిన రాయల్ ట్రస్ట్.
ఎం.గణేశ్, జర్నలిస్టు
కలలు కన్న కళ్లకు ఆర్థిక అడ్డంకులు కనిపిస్తున్న వేళ, ఆ కలలకు ధైర్యం చెప్పే చేయూతే అసలైన సేవ. చదువుకోవాలనే తపన ఉన్నా, పరిస్థితులు సహకరించని వందలాది విద్యార్థుల జీవితాల్లో ఆశల వెలుగులు నింపుతూ రాయల్ సర్వీస్ ట్రస్ట్ మరోసారి తన మానవీయతను చాటింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలోని ఎన్.బి.కె. భవనంలో నిర్వహించి, అన్ని వర్గాలకు చెందిన 370 మంది విద్యార్థులకు రూ.33 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను అందజేసింది. ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ మరియు రాయల్ క్లబ్ విజయవాడ సౌజన్యంతో ఈ సహాయం అందింది. ఈ మొత్తంతో కలిపి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు విద్యార్థులకు రూ.46 లక్షల స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ ఇ. నరహరి తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ రాయల్ శీతాలం రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం, ఒక అధికారిక సభగా కాకుండా… విద్యార్థుల కలలకు అండగా నిలిచిన ఒక భావోద్వేగ క్షణంగా మారింది. వేదికపైకి వచ్చిన ప్రతి విద్యార్థి ముఖంలో ఆశ, భరోసా, భవిష్యత్తుపై నమ్మకం స్పష్టంగా కనిపించింది. చదువు మధ్యలో ఆగిపోతుందేమో అన్న భయానికి బదులు, “ఇక ముందుకు వెళ్లగలం” అనే ధైర్యం వారి కళ్లలో మెరిసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెస్టిన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ డా. కోటి దుర్గా ప్రసాద్, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, చదువు ఒక డిగ్రీకే పరిమితం కాదని, సరైన రంగాన్ని ఎంచుకుంటే జీవితాన్ని నిలబెట్టే సాధనమవుతుందని చెప్పారు. ముఖ్యంగా ఆతిథ్య రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలు, అభివృద్ధి మార్గాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సులభంగా అర్థం చేసుకునేలా వివరించారు. చదువుతో పాటు దిశ ఉంటేనే విజయం సాధ్యమని ఆయన మాటలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను నాటాయి. రాయల్ క్లబ్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు మాట్లాడుతూ, క్రమశిక్షణ లేకుండా ఎంత ప్రతిభ ఉన్నా అది ముందుకు నడవదని చెప్పారు. లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలని, ఈ స్కాలర్‌షిప్‌లు ఒక అవకాశమేగానీ గమ్యం కాదని విద్యార్థులకు గుర్తు చేశారు.

నరసాపురం వైఎన్ కాలేజ్ ప్రొఫెసర్ డా. సిహెచ్. శ్రీనివాస్ చేసిన ప్రసంగం తల్లిదండ్రులను కూడా ఆలోచనలో ముంచింది. స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థులు చదువును బాధ్యతగా తీసుకోవాలని, ఈ సహాయం వెనుక ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత వారి మీద ఉందని అన్నారు. పేద విద్యార్థుల కోసం కోట్లాది రూపాయలతో రాయల్ సర్వీస్ ట్రస్ట్ చేస్తున్న సేవలు సమాజానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. ఈ సభలో హృదయాన్ని తాకిన మాటలు ఐటీ విభాగ నిపుణుడు రాందేవ్ రామ్ కుమార్ చేసిన ప్రసంగం సభలోని ప్రతీ ఒక్కటి హృదయాన్నితాకాయి. “ఒక పరిచయమున్న వ్యక్తి చేసిన సహాయం వ్యక్తి రుణం… దాన్ని వడ్డీతో అయినా తిరిగి చెల్లించవచ్చు. కానీ సమాజం నుంచి మనం పొందిన సహాయం కర్మ రుణం” అని ఆయన చెప్పిన మాటలు సభలో నిశ్శబ్దాన్ని నింపాయి. తన జీవితంలో తొలిసారి రూ.500 స్కాలర్‌షిప్ తీసుకున్న రోజును గుర్తు చేసుకుంటూ, విద్య కోసం లభించే సహాయం కేవలం ఫీజు కట్టడానికి మాత్రమే కాదని, సరైన సమయంలో అది మన జీవిత దిశనే మార్చే అద్భుత ప్రోత్సాహమని చెప్పారు. ఆ సహాయాన్ని డబ్బుగా కాదు, సేవగా తిరిగి చెల్లించాల్సిందేనని విద్యార్థులకు హృదయపూర్వకంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ పేటేటి పుల్లయ్య రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆవిర్భావం వెనుక ఉన్న ఆలోచనను వివరించారు. సభ్యుల సమిష్టి కృషి, దాతల సహకారంతో ఈ ట్రస్ట్ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు. రాయల్ సర్వీసెస్ రాయల్ క్లబ్ అధ్యక్షుడు ఇమడాబత్తుల నరహరి, అమరావతి రాయల్ క్లబ్ అధ్యక్షుడు బండి రామ్మోహన్రావు, ట్రస్ట్ కార్యదర్శి తోట పద్మనాభరావు, కోశాధికారి అంకెం రామ సాయి ప్రసాద్, వైస్ చైర్మన్లు ఈమని దామోదర రావు, గునుకుల పుల్లయ్య, సహాయ కోశాధికారి సాగి కోటేశ్వరరావు తదితరులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముగింపు : చదువు ఆగిపోకుండా చేయూతనిచ్చే ఈ ప్రయత్నం, ఒక్క రోజుతో ముగిసే కార్యక్రమం కాదు. ఇది వందల మంది విద్యార్థుల జీవితాల్లో కొత్త ప్రయాణానికి ఆరంభం. ఒక స్కాలర్‌షిప్ రూపంలో మొదలైన ఈ చేయూత, రేపటి రోజున సమాజాన్ని మార్చే శక్తిగా మారుతుందనే నమ్మకమే రాయల్ సర్వీస్ ట్రస్ట్ సేవల అసలైన విజయం.
