వైభవోపేతంగా గోదాదేవి కళ్యాణం…

— దైవిక అనుభూతితో పులకించిన భక్తజనులు…

— పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు…

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మ తోటలోని దేవస్థానంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పుణ్యకార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో, వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత ఘనంగా సాగింది. ఆలయ ప్రాంగణం అంతటా మంగళవాయిద్యాల నాదాలు, సుగంధ పుష్పాల అలంకరణలు భక్తుల్లో ప్రత్యేకమైన ఆనందాన్ని నింపాయి. ధనుర్మాసం ఆరంభం నుంచి దేవస్థానంలో నిత్యం గోదాదేవి, శ్రీకృష్ణుల స్వామివార్లకు నిత్య కైంకర్యాలు అర్పించారు. అండాళ్‌గా ప్రసిద్ధి చెందిన గోదాదేవి, పరమభక్తితో విష్ణువునే వరుడిగా కోరిన మహానుభావురాలు. ఆమె భక్తి, త్యాగం, ప్రేమకు ప్రతీకగా ఈ కళ్యాణోత్సవాన్ని తిరుమలలో నిర్వహించడం విశేషంగా భావిస్తారు. గోదాదేవి కళ్యాణం ద్వారా భక్తి మార్గంలో నిలకడ, దైవానుభూతి ఎంత శ్రేష్ఠమో భక్తులకు తెలియజేస్తుంది.

ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఆలయ పండితులు మురళీకృష్ణ స్వామి అయ్యంగార్, వెంకట శశికిరణ్ లు శాస్త్రోక్తంగా వేద మంత్రాలు చదువుతూ గోదాదేవి కథను వివరించారు. విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు) తులసివనంలో పాదాలు తీస్తుండగా అయోనిజురాలైన గోదాదేవి భూమిలో దొరికింది. ఆమెను కోదై (పూలమాల) పేరుతో పెంచుకున్నాడు, కాలక్రమేణా గోదాగా పిలిచేవారు.గోదాదేవి (ఆండాళ్) శ్రీరంగనాథుడితో ఐక్యమైన ఘటన భోగి రోజునే జరిగినట్టు పురాణాలు చెబుతాయి. ఆమె తులసీ మాలలు తయారు చేసి విష్ణుమూర్తికి అర్పించుకుని, తిరుప్పావై వ్రతంతో పరమాత్మను పొందిన మహిమ ఈ రోజు పునరావృతం అవుతుంది. ఈ కళ్యాణం సంతానం, కల్యాణ ప్రాప్తికి ఫలదాయకం అని భక్తుల విశ్వాసం. ధనుర్మాస చివరి రోజైన భోగి రోజు విష్ణుచిత్తుని కలలో శ్రీరంగనాథుడు కనిపించి గోదాను శ్రీరంగానికి తీసుకురావాలని చెప్పాడు. అక్కడ భక్తుల సమక్షంలో గోదా రంగనాథునితో ఐక్యమైంది, ఆ కల్యాణ మహిమ ఏటా భోగి రోజు పునరావృతమవుతుందని గోదాదేవి కళ్యాణ విశిష్టతను వివరించారు. కళ్యాణ వేడుకలకు హాజరైన భక్తులు దైవికమైన అనుభూతితో గోదాదేవి ఆశీర్వచనం కోసం ప్రార్థించారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొనే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందనేది పురాణ గాధ. పెద్ద సంఖ్యలో భక్తుల రాక పురస్కరించుకొని ఆలయ పర్యవేక్షకులు మల్లికార్జున, ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 3000 మందికి పైగా కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. దేవస్థానం అధికారులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులందరూ కల్యాణోత్సవాన్ని భక్తి పారవశ్యంతో తిలకించారు.

Post Views: 34