పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాపై జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
‘‘ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందించే బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. 20 నిమిషాలపాటు ఉండే ఒక దాన్ని పవన్ రూపొందించారు. ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఈ సీక్వెన్స్‌లో 1100 మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో 61 రోజులు దీన్ని చిత్రీకరించాం. దీని కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. గ్రౌండ్ వర్క్ చేశారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్లతో చర్చించారు (Hari Hara Veera Mallu Update). సినిమా మొత్తంలో ఇదే హైలైట్ కానుంది’’ అని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నట్లు జ్యోతికృష్ణ తెలిపారు.
ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలోని ప్రతి అంశంలో పవన్ భాగమయ్యారని తెలిపారు. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
