సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును షాతో పంచుకున్నట్లు తెలిసింది. వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరగనున్న ఎన్నికపైనా చర్చించినట్లు సమాచారం. ఈ స్థానాన్ని భాజపాకు వదిలిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఆ విషయాన్ని తెదేపా నాయకులు ధ్రువీకరించలేదు.
అయితే, చంద్రబాబు కంటే ముందు అమిత్ షాను కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగలు కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు కృష్ణమాదిగ ఆ తర్వాత విలేకర్లకు చెప్పారు. అనంతరం ఆయన దిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసం జన్‌పథ్‌కు వచ్చి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు భాజపా నాయకత్వం తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లను ప్రతిపాదిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అటు తెదేపా, ఇటు భాజపా నాయకులు ధ్రువీకరించలేదు.
