అవనిగడ్డ
శ్రీకాకుళం లో మే 14న శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్రుల తొలి రాజధానిగా గుర్తింపు కలిగిన శ్రీకాకుళం గ్రామంలో ఆంధ్ర జాతి పేరుతో శ్రీ ఆంధ్ర మహావిష్ణువు స్వయంభువై వెలసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీకృష్ణదేవరాయ ప్రభువు ఆముక్తమాల్యదా గ్రంథ రచన చేయడం ద్వారా ఈ దేవస్థాన ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేశారని కొనియాడారు. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన దేవస్థానంలో జరిగే శ్రీకృష్ణదేవ రాయ మహోత్సవాలను ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు, బర్మా ప్రసాద్, తోట చెన్నకేశవ, పయ్యావుల నాగరాజు పాల్గొన్నారు.
