దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో ‘బ్లాక్ హిల్స్’గా పేరొందిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు కూంబింగ్ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం.. 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించనంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్ బలగాలకు కత్తిమీద సాముగా మారింది. శుక్రవారం రాత్రి కర్రెగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో కల్లోలంగా మారిందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి నాలుగు హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నట్లు తెలిపారు. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్‌జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కి.మీ. పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్లుగా విస్తృత ప్రచారం సాగినప్పటికీ అధికారులు నిర్ధారించలేదు.
కర్రెగుట్టల అభయారణ్యంలో ఎఫ్‌ఓబీ(ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్)ల ఏర్పాటు ప్రక్రియ దూకుడుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌ను వీటితోనే ఛిన్నాభిన్నం చేశారు. అదే తరహాలో ఇక్కడా ఎఫ్‌ఓబీలు నెలకొల్పి మావోయిస్టులను నిలువరించాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ గుట్టలకు సమీపంలో ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీమారంపాడు, పూజారికాంకేర్, నంబి, గల్గం, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్పలో బేస్ క్యాంపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్టలకు అనుబంధంగా ఉన్న పామునూరు, తడపల, పెనుగోలు ప్రాంతాల్లో వాటి ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాంపుల్లో దాని పరిధికి అనుగుణంగా 500 నుంచి 1000 మంది జవాన్లతో భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
