పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి చేరువగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధవిమానాలు, యూఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేల కూల్చడానికి ఎంఆర్‌శామ్ ఉపయోగపడుతుంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను నేవీ పరీక్షించింది. యుద్ధసన్నద్ధతను చాటింది.
ఉక్కిరిబిక్కిరి చేసేలా..
విమానవాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధనౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళుతుంది. వీటన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (సీబీజీ)గా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన దాడి బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
విక్రాంత్ కదలికలను బట్టి.. పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్‌ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఆ దేశ వాణిజ్యంలో 60 శాతానికిపైగా ఈ రేవుల నుంచే సాగుతోంది. పాక్ తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది.
దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోలు, డీజిల్‌తోపాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. దేశంలోని దాదాపు మూడోవంతు విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌పై విక్రాంత్ దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువభాగం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి.
ఒకవేళ యుద్ధం చేయాల్సివస్తే విక్రాంత్.. కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్యారియర్ గ్రూప్.. వాయు, ఉపరితల, సముద్రగర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విక్రాంత్‌పై ఉండే మిగ్-29కె ఫైటర్ జెట్‌లు పాకిస్థాన్‌లోని మస్రూర్, సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేయగలవు. ఈ యుద్ధవిమానాలు ఏకబిగిన 850 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు. భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక ఆదేశిక, నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు.
పోర్టుల్లోని కీలక మౌలిక వసతులు, ఇంధన నిల్వ వసతులను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించడానికీ అవకాశం ఉంది.
