అర్హతకు అందలం
2020 నుంచి ఎన్టీఆర్ జిల్లాపార్టీ అధ్యక్షునిగా కొనసాగింపు…
తాజాగా కెడీసీసీ చైర్మన్ పదవి ….
నిబద్ధతకు నిదర్శనంగా నెట్టెం రఘురాం…
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
అర్హతకు అందలం దక్కింది. పదవికి పరపతి పెరిగింది. ఎంతో మంది సీనియర్ నాయకులు, నిష్ణాతులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చైర్మన్ గా పని చేశారు. ఆ పదవి ద్వారా జాతీయ స్ధాయి బ్యాంకు (ఆప్కాబ్)కు చైర్మన్ గా ఎన్నికయ్యారు. రైతులకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ ఎత్తున రుణ సౌకర్యం కల్పించారు. ఆయా రంగాలపై ఆధారపడిన సంస్ధలకు ఆర్ధిక పరిపుష్టి కలిగించారు. పదవితోపాటు బ్యాంకుకు జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. రుణాల చెల్లింపు, వసూళ్లలో రికార్డులను తిరగరాశారు. అదే స్ధాయిలో బ్యాంకు ప్రతిష్ఠను ఇనుమడింప చేయగల సమర్ధత నెట్టెం రఘురామ్ కలిగి ఉండటంతో ఆ పదవిలో నియమితులయ్యారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నెట్టెం చాలాకాలం తరువాత అంతే గుర్తింపు కలిగిన పదవిని పొందారు.
మూడుసార్లు జగ్గయ్యపేట ఎమ్మేల్యే
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన నెట్టెం రఘురాం రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరుగా ఉన్నారు. ఈయన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మళ్లీ రంగ ప్రవేశం చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి 1985లో తొలిసారిగా ఎమ్మెల్యే గా గెలిచి ఆ తర్వాత రెండు పర్యాయాలు అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కృష్ణాజిల్లా రాజకీయాల్లో ముఖ్య నేతగా వెలుగొందారు. నిబద్ధతకు నిదర్శనంగా ఉండే నెట్టెం రఘురాంకు తాజాగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ పదవి లభించింది. ఈ పదవితో ఆయన పరపతి మరింత పెరిగిందనే అభిప్రాయం పార్టీతోపాటు ప్రజల్లోనూ వ్యక్తమవుతుంది. పదవి లేకపోయినా పార్టీ పట్ల నిబద్ధత తో వ్యవహరించి విధేయుడిగా పేరొందిన రఘురాంకు సముచిత స్థానం దక్కింది.
బ్యాంకుకు సముచిత సేవలు అందించడం ద్వారా ఖ్యాతిపొందిన కొందరు నేతల వివరాలు
యెర్నేని ఉమాప్రసాద్
పిన్నమనేని వెంకటేశ్వరరావు (చిట్టిబాబు)
టి.డి.జనార్ధన్
వసంత నాగేశ్వరరావు.(మాజీ మంత్రి)
పిన్నిమనేని వెంకటేశ్వరరావు.(మాజీ మంత్రి)
