కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) తన కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్రబృందం. ఇందులో చిరుకు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా, అందులో ఓ నాయిక పాత్ర కోసం నటి నయనతారను రంగంలోకి దించేందుకు చిత్ర వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై నయన్‌తో (Nayanthara) చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది చిరు – నయన్‌ల కాంబోలో హ్యాట్రిక్ సినిమా కానుంది. వీళ్లిద్దరూ గతంలో ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో కలిసి సందడి చేశారు. ఇక ఈ చిత్రంలో మరో పాత్ర కోసం ఓ యువ నాయికను ఖరారు చేయనున్నారు. వినోదం, యాక్షన్, కుటుంబ అంశాలతో అల్లుకున్న కథతో రూపొందనున్న చిత్రమిది. చిరంజీవి దీంట్లో శివ శంకర వరప్రసాద్‌గా తన ఒరిజినల్ పేరుతో ఉన్న పాత్రలో కనిపించనున్నారు. హీరో వెంకటేశ్ ఓ ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు.
