సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో రూ.20 వేల చొప్పున అందజేయనుంది. ‘పీఎం కిసాన్’ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని జమ చేయనుంది. అటవీ భూములపై హక్కు కలిగిన(ఆర్‌ఓఎఫ్‌ఆర్) వారినీ అర్హులుగా గుర్తించనుంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతోపాటు తహసీల్దారు, మండల వ్యవసాయాధికారి తమ పరిధిలోని రైతుల వివరాలను పరిశీలించి, ధ్రువీకరించిన అర్హుల జాబితాలను ఈ నెల 20లోగా ‘అన్నదాత సుఖీభవ’ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించింది. పథకం అమలుకు సంబంధించి వ్యవసాయశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
‘పీఎం కిసాన్’నూ సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా జాబితాలను నవీకరించాలని కేంద్రం ఆదేశించింది. మే ఆఖరులోగా ఈ జాబితాలనూ సిద్ధం చేయనున్నారు. చనిపోయిన వారి పేర్ల తొలగింపు, భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు, రైతుల ఐడీ నంబర్లు, పెండింగ్‌లో ఉన్న ఆధార్, ఈకేవైసీ వివరాలు సరిదిద్దాలి. గిరిజనశాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ హక్కుల చట్టం, ఆదివాసీ గిరిజనుల(పీవీటీజీ)కు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది.
భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్‌గా పథకం అమలు చేయనుంది. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి సాయం అందిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకూ పథకం వర్తిస్తుంది.
ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి పథకం వర్తించదు. తాజా, మాజీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ ఛైర్ పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన/నిర్వహించే వారు అర్హులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారికీ పథకం వర్తించదు. నెలకు రూ.10 వేలు, ఆపైన పెన్షన్ తీసుకునే వారూ అర్హులు కాదు. మల్టిటాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు.
వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులూ అర్హులు కాదు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారూ పథక ప్రయోజనాలు అందుకోలేరు.
