తలనొప్పి ఒక వ్యాధి కాదు. వివిధ శారీరక, మానసిక రుగ్మతల్లో వ్యక్తమయ్యే లక్షణమే. తల, మెదడుకు సంబంధించిన బాహ్య, అభ్యంతర, స్థానిక కారణాలవలన కొన్ని విధాలైన తల నొప్పులు సంభవిస్తే, ఇతర శరీర భాగాల్లో వ్యాధిగ్రస్తమైన అవయవాల ప్రభావం తాలూకు లక్షణాల్లో ఒకటిగా తలనొప్పి వస్తుంది. కొన్ని తలనొప్పులు దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తే, మరి కొన్ని ప్రాణాంతకంగా కూడా తయారవుతుంటాయి. ఏది ఏమైనా తలనొప్పులకు సంబంధించిన ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకుంటే, దానిని ఎదుర్కో వడటం అంత కష్టతరం కాదు. తలకు ఇరుపక్కలా నొప్పిగా, బరువు పెట్టినట్లు, బిగించినట్లు కొందరిలో తలనొప్పి వస్తుంది. ఆందోళన, ఆతృత, మనో వ్యాకులత, ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి అతిగా చింతిస్తుండటం మొదలైన కారణాల వలన వచ్చే ఇలాంటి తలనొప్పిని టెన్షన్ హెడ్ ఎక్ డి వ్యవహరిస్తారు.
జీవన శైలిలో మార్పులు చేసుకుని, మానసిక ప్రశాంతత అలవరచుకోవడం, యోగ, ధ్యానంలాంటి ప్రక్రియలు వీరికి బాగా ఉపయోగపడుతాయి. మనం తీసుకునే ఆహార వేళల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం, సరిపడని ఆహారం తీసుకోవడం, అకాల భోజనం మొదలైన కారణాల వలన కూడా తలనొప్పి వస్తుంటుంది. ఆహారపు అలవాట్లను నియమబద్ధం చేసుకుంటే ఈ సమస్య ఉండదు.
కొందరిలో నుదురు భాగంలో కంటికి పైన ఉండే సైనస్ అనే గాలి కుహరాలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి ఉదయంపూట ఎక్కువగా ఉంటూ, ఎండ పడే కొద్దీ క్రమేపీ తగ్గిపోతుండటం, ముందుకు వంగినప్పుడు నొప్పి ఎక్కువ కావటం వంటి లక్షణాలతోపాటు జ్వరం, వాంతులు అనుబంధంగా ఉంటాయి. దీనిని సైనసైటిస్ అంటారు. ఈ వ్యాధి ప్రారంభావస్థలో తరచూ జలుబు చేస్తుండటం ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఎక్స్ రే , సిటిస్కాన్ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది.
