
మారుతున్న ఆహారపు అలవాట్లు కావొచ్చు… పెరుగుతున్న మానసిక ఒత్తిడి కావొచ్చు… ఏదైనాకానీ సాటి మనిషికి పట్టుకున్న భయం మధుమేహం! అదే డయాబెటిస్. ఎక్కడ ఏ పదిమంది పలకరించుకున్నా చర్చంతా దీనిపైనే. డయాబెటిస్ వ్యాధి ఎంత భయకరంగా వ్యాపిస్తుందో దీన్నిబట్టి తెలుస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ ఏడాది డయాబెటిస్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతుండడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తంచేస్తోంది. డయాబెటిస్‌ను దరిచేరనీయకుండా చేయడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రచారాన్ని మరింత ముమ్మరంగా చేసే అజెండాను రూపొందించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో మూడొందల యాభై మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపతుండగా, రాబోయే ఇరవై ఏళ్లల్లో ఈ సంఖ్య ఏడొందల మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలో డయాబెటిస్ ఎక్కువగా జిల్లాల్లో కృష్ణా రెండో స్థానంలో ఉందని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. గుండెపోటుతో పది మంది మరణిస్తే అందులో ఆరుగురికి డయాబెటిస్ ఉంటుంది. డయాలసిస్ (రక్తశుద్ధి) చేయించుకునే ప్రతి పదిమందిలో ఐదుగురికి ఈ వ్యాధి ఉంటోంది.
‘ఆకారం’ మారితే అంతే..
ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లలో చాలా తేడాలొచ్చాయి. మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నాం. డయాబెటిస్‌కు అసలు కారణం ఇదే. మన శరీరానికి అవసరమైన క్యాలరీలను అందించే ఆహారాన్నే తీసుకోవాలి. దీనికి మించి తీసుకోవడం వల్ల పొట్ట, పేగు పరిమాణం పెరుగుతుంది. అలాగే వివిధ అవయవాల చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. ఆహారం జీర్ణమవ్వడానికి అవసరమయ్యే ఇన్సులిన్‌ను పాంక్రియాస్ అందిస్తుంది. ఇది సుమారుగా 30-40 యూనిట్ల ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కడుపులో క్యాలరీలకు మించిన ఆహారం ఉన్నప్పుడు ఇన్సులిన్ విడుదల కావడంలో క్రమం తప్పుతుంది. ఒకవేళ ఇన్సులిన్ విడుదలైనా అది జీర్ణవ్యవస్థకు చేరదు. పేగుల చుట్టూ అల్లుకుపోయిన కొవ్వు దాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల బరువుతోపాటు, శరీరమూ పెరుగుతుంది. ఒకసారి కొవ్వు తయారవ్వడం మొదలైతే ఇక శరీరమంతా పాకుతుంది. మనం తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణమైపోవాలి. అలా కానప్పుడు ఊబకాయం మొదలవుతుంది.
ఇలా..!
డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌గా ఈ వ్యాధిని గుర్తించారు.
టైప్ 1 డయాబెటిస్ ఉన్న వాళ్లల్లో బ్లడ్‌షుగర్‌ను నియంత్రించే హార్మోన్లకు అవసరమైన ఇన్సులిన్‌ను క్లోమం విడుదల చేయదు. దీనికి జన్యుపరమైన లేక పర్యావరణ పరిస్థితులు ఒక కారణం.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్లల్లో శరీరం అవసరమైన ఇన్సులిన్ సక్రమంగా విడుదలకాదు. దీనివల్ల శరీరం బరువు పెరుగుతుంది. మానసిక ఉల్లాసం తగ్గిపోతుంది.
చిన్నపిల్లలు, యుక్తవయస్కుల్లో టైప్ 2 డయాబెటిస్ పెరుగుతూ వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
డయాబెటిస్ గుండెపై ప్రభావాన్ని చూపుతోంది. దీనివల్ల గుండెపోటు సంభవిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన బహుళ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో డయాబెటిస్ ఉన్న యాభైశాతం మంది కార్డియెవాస్కులర్ వ్యాధితో మరణించారు.
ఇది శరీరంలోని రక్తప్రసరణను తగ్గించడమే కాకుండా నరాలను దెబ్బతీస్తుంది. అలాగే పాదాల్లో పుండ్లు తయారయ్యే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఆ అవయువం సరిగా పనిచేయదు.
డయాబెటిస్ రెటీనోపతి వల్ల అంధత్వం వస్తుంది. రెటీనాలో ఉండే చిన్న రక్తనాళాలపై ఈ వ్యాధి ప్రభావం పడడం వల్ల రెటీనా దెబ్బతింటుంది.
ప్రపంచంలో ఒక శాతం మంది డయాబెటిస్ వల్ల అంధత్వం బారిన పడ్డారు.
కిడ్నీలు సక్రమంగా పని చేయకపోవడానికీ డయాబెటిస్ ఒక ప్రధాన కారణం.
డబ్ల్యూహెచ్‌వో అధ్యయనాల ప్రకారం డయాబెటిక్ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా బయటపడుతోంది.
దీని వల్ల గుండె, రక్తనాళాలు, కళ్లు, కిడ్నీలు, నరాలు చెడిపోతాయి. ఈ ప్రభావం రక్తప్రసరణ వ్యవస్థపై పడడంతో రోగులు చనిపోతున్నారు.
ఆహారపు అలవాట్లలో విపరీతమైన తేడాలు రావడంతోనే ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.
గర్భవతులకు డయాబెటిస్ సోకితే ప్రసూతి సమయం ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కోసారి తల్లికి, శిశువుకు ఇది హాని కలిగిస్తుంది.
పాలిష్డ్ రైస్, పిజ్జాలు, బర్గర్లు, బిగ్ కోక్‌లు, చిప్స్, ప్యాకెట్ ఫుడ్‌లో క్యాలరీల శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటికి దూరంగా పెట్టాలి.
శారీరక శ్రమ అవసరం
మన శరీరాన్ని ఎంత కష్టపెడితే షుగర్, కొవ్వు, రక్తపోటు అంత దూరంగా ఉంటాయి. రోజూ కాకపోయినా వారానికి ఐదు రోజులపాటు 30-60 నిముషాల చొప్పున వ్యామాయం చేయాలి. అలాగే నడకకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తరచుగా బైక్‌లు, కారులు ఉపయోగించడానికి బదులు నడచి వెళ్లడం మంచిది. కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లకు బదులు మెట్ల మార్గాలను ఉపయోగించుకోవాలి.
ఆరోగ్యవంతమైన జీవితానికి
- పండ్ల రసాలు, సోడాకి బదులుగా మంచినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.
- ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, సజ్జలు, గోధుమ వంటకాలను తినడం మంచిది.
- ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
- పూర్తి నూనె పదార్థాలైన పరోటా, పూరీ, సమోసాలతో పాటు వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
- కూరల్లో నూనె వాడకాన్ని తగ్గించాలి. నెలకు మనిషికి అర లీటరుకు మించకూడదు.
- రాత్రిపూట తినే ఆహారానికి పరిమితి విధించుకోవడం మంచిది. తక్కువ అన్నం, చపాతీలు లేక నాన్ వంటి వాటితో కడుపు నింపుకోవాలి.
- రాత్రివేళల్లో చక్కెర లేని పానీయాలను తీసుకోవాలి.
- శరీర బరువులో ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- రోజులో కనీసం అరగంటపాటు వ్యాయాయం చేయాలి.
- రోజూ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మూడు లేక ఐదు రకాల పండ్లను తినాలి. దీనివల్ల షుగర్ నియంత్రణ కావడంతోపాటు కొవ్వు పెరుగుదల ఆగిపోతుంది.
- ధూమపానం వల్ల కార్డియె వాస్కులర్ వ్యాధులు సంక్రమిస్తాయి.అందుకే
- ధూమపానానికి దూరంగా ఉండాలి.
- అధిక బరువు ఉన్న వాళ్లు చక్కెర, తేనె, గ్లూకోజ్, జామ్, స్వీట్లు, కేక్‌లు, కొబ్బరినీళ్లు సాఫ్ట్‌డ్రింక్స్, అరటిపండ్లు, మామిడికాయలు, సీతాఫలాలు, డ్రైఫ్రూట్స్, రొట్టెలు, బెల్లం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
- వైద్యుల సలహాలను బట్టి యాపిల్, కమలా, స్వీట్ లెమన్, బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజాలను తినాలి.
- రెండొందల క్యాలరీలకు సమానమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు మూడు ఇడ్లీలు, రెండు దోసెలు, మూడు చపాతీలు తీసుకుంటే మంచిది.
- వెన్న తీసిన మజ్జిగ, టమోటా రసం, మిరియాల రసం తరచుగా తాగడం వల్ల డయాబెటిస్‌ను చాలా వరకూ దూరంగా ఉంచొచ్చు.
‘డి’ విటమిన్ గుర్తుందా?
వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ డయాబెటిస్ వ్యాధి ప్రబలడానికి గల కారణాల్లో డి విటమిన్ ఒకటి. జీవన విధానంలో వస్తున్న మార్పులతో డి విటమిన్ మాటను చాలా వరకు మరచిపోయాం. ఇళ్లలో ఏసీ… కారుల్లో ఏసీ… రెస్టారెంట్లలో ఏసీ… ఇలా ఎక్కడికక్కడ ఏసీల్లో గడపడం అలవాటైపోవడంతో డి విటమిన్‌ను మరచిపోయారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైతే ఇక పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. ఉదయంపూట సూర్యరశ్శి ద్వారా విడుదలయ్యే డి విటమిన్ శరీరంలో లేకపోవడం వల్ల డయాబెటిస్ వేగంగా వస్తోంది. అలాగే సరిపడా నిద్ర లేకపోవడమూ ఒక ప్రధాన కారణం.
